puducherry Lieutenant governor
-
సూర్యుడు ఓం అంటున్నాడు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న వీడియోలు నకిలీవా?, ఒరిజినల్‌వా అని తేల్చుకోలేని పరిస్థితి ఉంది. కొందరు సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ ఖాతాల్లో నకిలీ వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోల్స్ బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. ఇంతకీ విషయమేమిటంటే.. ‘సూర్యుడు ఓం అని పలుకుతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాన్ని రికార్డు చేసింది’ అని ఆమె ఒక వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా శనివారం పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ ట్వీట్‌ను 7వేల మందికి పైగా రీట్వీట్ చేయడంతో పాటు వందల మంది దానిపై స్పందించారు. అయితే వాస్తవానికి ఇదో నకిలీ వీడియో. ఇది భారత వాట్సాప్ గ్రూపుల్లో చాలాకాలాంగా సర్క్యులేట్ అవుతోంది. అందులో ఎలాంటి ఓం వినిపించదు. దీంతో పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ‘‘సూర్యుడు.. ‘వాహ్ మోదీజీ.. వాహ్’ అని అనడం కూడా ప్రారంభిస్తాడు’’ అంటూ కిరణ్ బేడీపై వ్యంగ్య వ్యాఖ్యలు కనిపించాయి. అసలు సంగతి ఏంటంటే ‘సూర్యుడు నిశ్శబ్దంగా ఉండడు. సూర్యుడి గుండెచప్పుడు వినడం ద్వారా శాస్త్రవేత్తలు దానిలోని సౌర పదార్థాల ప్రవాహాలను, తరంగాలను, అలజడులను మరింత విస్తృతంగా శోధిస్తున్నారు. దీంతో గతంలో తెలియని అనేక సౌర రహస్యాలను తెలుసుకునేందుకూ వీలు ఏర్పడింది’ అని 2018లో నాసా ఒక ట్వీట్ చేసింది. -
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వెళ్లను..
యానాం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తలను పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తోసిపుచ్చారు. తాను ఏపీకి గవర్నర్‌గా వెళ్లనున్నట్లు వచ్చే వార్తలు నిరాధారమని ఆమె అన్నారు. ఆమె నిన్న (గురువారం) విలేకరులతో మాట్లాడుతూ తాను చేపట్టే కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో తనకు మంచి పేరు వస్తోందని, ఈ తరుణంలో పుదుచ్చేరిలోనే ఎల్జీగా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇక ఏ రాష్ట్రానికి వెళ్లే ప్రసక్తే లేదని కిరణ్ బేడీ స్పష్టం చేశారు. కాగా కిరణ్ బేడీ వెళ్లిపోతున్నట్లు వచ్చిన వార్తలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ వర్గీయులు ...ఆమె క్లారిటీ ఇవ్వడంతో నిరుత్సాహానికి గురయ్యారు. -
రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే..
పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్‌గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కోరారు. రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే ఆరోగ్యకరమైన పుదుచ్చేరిగా మారుతుందని అన్నారు. ప్రాస్పరస్ పుదుచ్చేరి కార్యక్రమాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలంటూ గతంలో కూడా కిరణ్ బేడీ రజనీకాంత్‌ను కోరారు. మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంగ్ గవర్నర్‌గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టాక ప్రతి శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో కలసి వ్యర్థపదార్థాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కిరణ్ బేడీ కోరారు. ఇంటి పరిసరాలు, రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరికి అన్నివిధాలా సాయం చేస్తోందని, పుదుచ్చేరి ఇండస్ట్రియల్ కారిడర్గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. -
పుదుచ్చేరి ఎల్జీగా కిరణ్ బేడీ ప్రమాణం
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ(66) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జీ రమేశ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. త్వరలో సీఎం కానున్న వీ నారాయణ స్వామి, మాజీ ముఖ్యమంత్రులు ఎన్ రంగస్వామి, ఆర్వీ జానకీరామన్, ఎండీఆర్ రామచంద్రన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
కాంగ్రెస్‌కు పక్కలో బల్లెం!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికార పగ్గాలు చేపట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్ముందు సంకట పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇందుకు కారణం పక్కలో బల్లెంలా ఆ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి నియమితులు కావడమే. డైనమిక్ లేడీగా పేరెన్నికగన్న కిరణ్ బేడీని పుదుచ్చేరికి పంపుతూ కేంద్రం ఆదివారం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు ఎక్కువ. ప్రభుత్వం తరఫున ఏ పథకం తీసుకురావాలన్నా, అధికార బదిలీల్లోగానీ, నిధుల విడుదల్లో గానీ, అన్ని రకాల వ్యవహారాల్లో గవర్నర్ సంతకం, అనుమతి తప్పని సరి. ఈ అనుమతుల వ్యవహారంలో ఇది వరకు పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఢీకొట్టే స్థాయికి వెళ్లింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి ఎన్ఆర్ కాంగ్రెస్ పయనించడంతో, లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వీరేంద్ర కఠారియాను మార్పించుకుంది. తదుపరి అండమాన్ గవర్నర్ ఏకే సింగ్‌కు అదనపు పగ్గాల్ని కేంద్రం అప్పగించింది. రెండేళ్లుగా ఏకే సింగ్ నెలలో రెండు మూడు రోజులు మాత్రమే పుదుచ్చేరిలో అడుగు పెట్టేవారు. దీంతో ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పరిస్థితులు మారాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ పతనమైంది. కాంగ్రెస్-డీఎంకే నేతృత్వంలోని కూటమి మెజారిటీ దక్కించుకుని అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా కొత్త గవర్నర్ నియమించ బడుతుండడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా డైనమిక్ లేడీగా పేరు గడించిన, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీని నియమించడంతో కొత్త ప్రభుత్వానికి ఇక రోజూ సంకట పరిస్థితులే. లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడీ అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోన్నది. ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వానికి ఇక, అధికారాలు కరువైనట్టే అన్న ప్రశ్న ఆదివారం బయలు దేరింది. ఇందుకు కారణం, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ భేడి పూర్తి స్థాయిలో పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులు కావడమే. ఇక్కడ ప్రభుత్వం ఉన్నా, సంతకాలు, అనుమతుల కోసం గవర్నర్ ఎదుట నిలబడాల్సిందే. ఈ దృష్ట్యా, కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించి కిరణ్‌బేడీని ఇక్కడకు పంపించేందుకు నిర్ణయించినట్టు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ సర్కారుకు మున్ముందు ఇరకాటంలో పెట్టడానికే అన్నది జగమెరిగిన సత్యం. విధి నిర్వహణలో నిక్కచ్చితనం, నిజాయితీ ఆమె నైజం అన్న విషయం తెలిసిందే. అయితే, తనకు పదవి దక్కడంపై స్పందించిన కిరణ్ భేడి ప్రజా సేవకు తాను అంకితం అని ఆమె పేర్కొన్నారు.