పంజాబ్ సీఎంకు మళ్లీ చుక్కెదురు!
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఎంపీగా ఎన్నికైన సమయంలో ఇక్కడి జన్‌పథ్‌లో ఆయనకు ఏర్పాటు చేసిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అమరిందర్ సింగ్‌కు గతంలో ఇక్కడ కల్పించిన అధికారిక భవనంలో 2019 వరకు ఉండొచ్చునని మొదట ప్రకటించారు. కానీ ఎస్టేట్ ఆఫీసర్ మార్చ్ 24 ఆర్డర్ ప్రకారం ఆయన ఇక్కడ ఉండేందుకు అర్హుడుకాదని అప్పీల్ చేయగా, దీన్ని తాజాగా ఢిల్లీ కోర్టు విచారించింది.
సీఎం అమరిందర్ జనపథ్‌లోని ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని సూచిస్తూ, ఆయన అనధికారికంగా ఉంటున్నారన్న వాదనను డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పూనమ్ ఏ బాంబా తోసిపుచ్చారు. అమరిందర్ గతేడాది నవంబర్ 23న తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, డిసెంబర్ 23న ఆయనకు ఈ నివాసాన్ని రద్దుచేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ బంగ్లాను సీపీడబ్ల్యూడీకి అప్పగించాల్సి ఉండగా, తాను హై బీపీ, షూగర్ సమస్యలతో బాధపడుతున్నానని.. మానవతా దృక్పథంతో ఆలోచించి తనను మరికొంత కాలం ఉండేందుకు అనుమతించాలని అమరిందర్ విజ్ఞప్తి చేసుకున్నారు.
ఈ ఫిబ్రవరి 10న లోక్‌సభ చైర్మన్, హౌస్ కమిటీ ఎదుట ఆయన హాజరుకావాల్సి ఉండగా, అమరిందర్ గైర్హాజరవుతున్నారు. దీనిపై వివరణ కోరుతూ ఫిబ్రవరి 23 వరకు గడువిస్తూ ఫిబ్రవరి 14న షో కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా ఈ విషయంపై విచారించిన ఢిల్లీ కోర్టు జనపథ్‌లోని బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది.