పంజాబ్: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఒక వృద్థుడు. వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌కు చెందిన 83 ఏళ్ల సోహన్ సింగ్ గిల్ జలందర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ ఇంగ్లీష్ మాస్టర్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ హోషియార్‌పూర్‌లో, 1937,ఆగస్టు15న జన్మించిన గిల్ 1957లో అమృత్‌సర్ జిల్లాలో గల కల్సా కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, టీచింగ్ కోర్స్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ కాలేజీలో చదివే రోజుల్లో వైస్ ప్రిన్సిపల్ వర్యమ్ సింగ్ నాకు మాస్టర్స్ చదవాలనే ప్రేరణ కలిగించారు. డిగ్రీ తరువాత పీజీ చేయాలనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కెన్యా నుంచి టీచర్ ఉద్యోగం రావడంతో పీజీ చేయాలనే నా కోరిక తీరలేదు’ అన్నాడు గిల్.
1991లో భారత్‌కు తిరిగి వచ్చాక వివిధ పాఠశాలల్లో అధ్యాపకునిగా సేవలందించానని, అయితే పీజీ చేయాలనే బలమైన కోరిక తీరలేదనే బాధ ఉండేదని గిల్ అన్నాడు. కానీ నేడు తన కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఆంగ్లాన్ని విపరీతంగా ఇష్టపడేవాడినని తెలిపాడు. ప్రస్తుతం తాను విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఈఎల్‌టీఎస్‌కు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపాడు.
గిల్ చదువులోనే కాక హాకీ, ఫుట్‌బాల్‌లో రాణించేవాడు. జర్నైల్ సింగ్ వంటి హాకీ లెజెండ్‌తో ఆడటం తనకు గుర్తిండిపోయే మదుర జ్ఞాపకం అని గిల్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కెన్యాలో అధ్యాపక వృత్తితో పాటు హాకీని నిరంతరం ఆడేవాడినని చెప్పుకొచ్చాడు. ఆటతో పాటు అంపైరింగ్ అనుభవం కూడా తనకుందని చెప్పడం విశేషం. తన విజయానికి ఆరోగ్యకరమైన జీవనశైలీ, సానుకూల దృక్పథాలే ప్రధాన పాత్ర పోషించాయని, భవిష్యత్తులో చిన్న పిల్లల కోసం పుస్తకాలు రాయాలని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment