
చండీగడ్ : అనారోగ్యం కారణంగా హాస్పటిల్‌లో చేరగా, పరీక్షలు నిర్వహిస్తే అతను మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. పంజాబీ గాయకుడు గురీందర్ పాల్ సింగ్ అలియాస్ బడ్డా గ్రెవాల్ 30 గ్రాముల ఓపియమ్(నల్లమందు) తీసుకోవడంతో.. అనారోగ్యం కారణంగా సొహానాలోని ఎస్‌జీహెచ్‌ఎస్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు సోహనా పోలీసులు శుక్రవారం గురీందర్‌ను అరెస్ట్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌పిడిఎస్) చట్టంలోని 27, 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సబ్ ఇన్‌స్పెక్టర్ హర్జిందర్ సింగ్ తెలిపారు.
మరోవైపు పంజాబ్‌లో యువత మాదకద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నట్లు ఇప్పటికే బహిర్గతమైంది. దీనిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ప్రధాని మోదీకి గతంలో లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి హోంశాఖ, ఆరోగ్య, న్యాయ శాఖలతో చర్చించి మరింత కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరారు.