నవ్‌జోత్ సింగ్ సిద్ధూ
చండీగఢ్: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. గత నెలలోనే ఆయన రాజీనామా చేసినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు, మంత్రివర్గంలో కీలక శాఖల నుంచి తప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో జూన్‌లోనే రాజీనామా చేసినట్లు ఆదివారం ఆయన ట్విట్టర్‌లో ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు పంపిన ఆ లేఖను సీఎంకు కూడా పంపుతానన్నారు.
పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జూన్ 6వ తేదీన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, స్థానిక పాలన శాఖల బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించి ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలను కేటాయించారు. దీంతోపాటు పలు ప్రభుత్వ కమిటీల్లో సిద్దూకు స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్దూ గత నెల 9వ తేదీన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసి, పరిస్థితిని వివరించడంతోపాటు ఒక లేఖను కూడా అందజేసినట్లు సమాచారం.
అప్పటి నుంచి ఆయన తనకు కేటాయించిన కొత్త మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టలేదు. దీంతో సిద్ధూ, సీఎం సింగ్‌ల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు పార్టీ అప్పగించింది. అయితే, సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావంతో నెల రోజులపాటు వేచి చూసినా ఎలాంటి ఫలితం కనిపించకనే తాజాగా సిద్ధూ తన రాజీనామా లేఖను బహిర్గతం చేసినట్లు సమాచారం. ఈ నెల రోజులు కూడా సిద్ధూ మీడియా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నారు.
సీఎం, సిద్ధూ విభేదాలు ఏమిటి?:
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రభావం కనిపించకపోవటానికి స్థానిక పాలన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న సిద్ధూయే కారణమంటూ సీఎం అమరీందర్ బాహాటంగా ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో మత విశ్వాసాలకు భంగం కలిగించిన బాదల్ కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ అంతకుముందు ఎన్నికల ప్రచారంలో సీఎంను సిద్దూ ప్రశ్నించారు. అదేవిధంగా, తనకు కెప్టెన్ రాహుల్ గాంధీయేనని, తన కెప్టెన్(సీఎం)కు కూడా ఆయనే కెప్టెన్ అంటూ గత ఏడాది సిద్దూ వ్యాఖ్యానించడం విభేదాలకు ఆజ్యం పోసింది.
Comments
Please login to add a commentAdd a comment