ఇంటికన్నా జైలే పదిలం | Puzhal central prison was safest place during floods | Sakshi
Sakshi News home page

ఇంటికన్నా జైలే పదిలం

Published Fri, Dec 11 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

ఇంటికన్నా జైలే పదిలం

ఇంటికన్నా జైలే పదిలం

పుళల్ సెంట్రల్ జైల్లోకి చుక్క వరదనీరు రాని వైనం
 చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరాన్ని నిలువునా ముంచేసిన వర్షాలు, వరదలతో ఆవేదన చెందిన వారే కాదు ఆనందించిన వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. వర్షాలు, వరదలపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసినవారంతా క్రిమినల్స్ కావడం విశేషం. ఇంటికన్నా జైలు పదిలం అంటూ పుళల్ సెంట్రల్‌జైలు ఖైదీలు చెబుతున్నారు. చెన్నై సెంట్రల్ ఎదురుగా, కూవం కాలువ గట్టుకు ఆనుకునే చెన్నై సెంట్రల్ జైలు ఉండేది. కొన్నేళ్ల క్రితం ఇక్కడి జైలును నగర శివార్లులోని పుళల్‌కు మార్చారు. 213 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో జైలు నిర్మాణం జరిగింది. ఈ జైలులో 3100 మందికి పైగా ఖైదీలు ఉంటున్నారు.

నగరంలో 20 రోజులపాటు కురిసిన వర్షాలతో మునిగి పోని ప్రాంతం అంటూలేదు. అయితే భారీ వర్షాల కారణంగా జైలుకు సమీపంలోనే పుళల్ చెరువు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహించినా పక్కనే ఉన్న జైలులోకి వరదనీరు చుక్క కూడా ప్రవహించలేదు. నగర ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నా తాము వేళకు భోజనం, కంటి నిండా నిద్రతో సుఖంగా ఉన్నామని ఖైదీలేకాదు, అక్కడి జైలు అధికారులు ఆనందంగా చెబుతున్నారు. పైగా ముంపు ప్రాంతాల్లో తమ కుటుంబాల వారు ఎలా ఉన్నారనే సమాచారాన్ని సైతం జైలు అధికారులు ఎప్పటికప్పుడు తెలపడంతో ఖైదీలు మరింత హాయిగా కాలం గడిపారు.

 గిండి క్రైం పోలీస్ స్టేషన్‌లో రికార్డులు గల్లంతు
 చెన్నై నగరంలోని గిండి క్రైం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో 30 అడుగులమేర వరదనీరు ప్రవహించడంతో స్టేషన్‌లోని క్రిమినల్ రికార్డులన్నీ గల్లంతయ్యాయి. ఇందులో అనేకరకాల నేరగాళ్లకు సంబంధించిన రికార్డులుండడంతో పోలీసులు తలలు పట్టుకోగా, నిందితులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement