ఆ ప్రైవేటు విద్యాసంస్థలు వ్యభిచార కొంపలట
బెంగళూరు: అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకునే కర్ణాటక సంక్షేమశాఖ మంత్రి హెచ్ ఆంజనేయ మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ వ్యభిచార గృహాల్లా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాహక్కు చట్టం లేకుంటే ఏ మధ్యతరగతి విద్యార్థికానీ, పేద విద్యార్థిగానీ ఈ విద్యాసంస్థల్లో చదవలేడని చెప్పారు. కర్ణాటక ప్రైవేటు విద్యాసంస్థల సమాఖ్యను ఈ సందర్భంగా ఆయన ఏకీపారేశారు.
'విద్య పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న ఈ ప్రైవేటు విద్యాసంస్థలన్నీ వ్యభిచార కొంపలు. అయితే, కొన్ని మంచి ప్రైవేటు స్కూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని మతపరమైన విద్యాసంస్థలు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం లేకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పేదవారు అస్సలు చదువుకోలేకపోయేవారు. బలవంతంగా అధికమొత్తం ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలన్నీ వ్యభిచారం చేస్తున్నట్లే' అంటూ ఆయన మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా హెచ్ ఆంజనేయ వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.