h anjaneya
-
ఆ ప్రైవేటు విద్యాసంస్థలు వ్యభిచార కొంపలట
బెంగళూరు: అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకునే కర్ణాటక సంక్షేమశాఖ మంత్రి హెచ్ ఆంజనేయ మరోసారి అనూహ్య వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ వ్యభిచార గృహాల్లా మారాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యాహక్కు చట్టం లేకుంటే ఏ మధ్యతరగతి విద్యార్థికానీ, పేద విద్యార్థిగానీ ఈ విద్యాసంస్థల్లో చదవలేడని చెప్పారు. కర్ణాటక ప్రైవేటు విద్యాసంస్థల సమాఖ్యను ఈ సందర్భంగా ఆయన ఏకీపారేశారు. 'విద్య పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న ఈ ప్రైవేటు విద్యాసంస్థలన్నీ వ్యభిచార కొంపలు. అయితే, కొన్ని మంచి ప్రైవేటు స్కూల్స్ కూడా ఉన్నాయి. కొన్ని మతపరమైన విద్యాసంస్థలు కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం లేకుండా కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పేదవారు అస్సలు చదువుకోలేకపోయేవారు. బలవంతంగా అధికమొత్తం ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలన్నీ వ్యభిచారం చేస్తున్నట్లే' అంటూ ఆయన మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా హెచ్ ఆంజనేయ వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. -
'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు'
న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 'నన్ను ఆ కుర్చీలో లేకుండా చేసేందుకు భారీ కుట్ర చేశారు. నేను దళితుడిని. పైగా దళితుల్లోనే అత్యంత తక్కువ కులానికి చెందిన వాడిని. చాలామందికి నేను అధికారంలో ఉండటం నచ్చడం లేదు. నా రాజకీయ భవిష్యత్తును ముగించేందుకు చాలామంది కుట్ర పన్నారు. సాధారణంగా నా ఇంటికి ఎప్పుడూ అతిథులు బహుమతులు, స్వీట్లతో వస్తుంటారు. నా భార్య ఏమి తెలియని ఒక పల్లెటూరు మహిళ. ఆ టీవీ వాళ్లు బహుమతి అని చెప్పి ఇస్తేనే తీసుకుంది. పైగా అందులో డబ్బు లేదని ఏవో కార్డులని చెప్పి తీసుకున్న తర్వాత డబ్బుతో నిండిన బహుమానం అని చెప్పారు. మాపై ఇలాంటి జులుం ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతుండటం చూస్తూనే ఉన్నాం' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పారు.