
మమత సింగపూర్ పర్యటనపై దుమారం
మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె చేస్తున్న మొదటి విదేశీ పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారింది.
మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె చేస్తున్న మొదటి విదేశీ పర్యటన అత్యంత వివాదాస్పదంగా మారింది. సాధారణంగా పరిశ్రమలు, పెట్టుబడులకు అంత అనుకూలంగా ఉండరని పేరున్న మమత.. తొలిసారిగా పెట్టుబడులను ఆహ్వానించేందుకు విదేశానికి వెళ్తున్నారు. అయితే.. ఆమె తనతో పాటు తీసుకెళ్తున్న వ్యక్తుల గురించి తీవ్ర దుమారం రేగుతోంది. గతంలో కోల్కతాలోని ఏఎంఆర్ఐ ఆస్పత్రిలో 2011లో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 93 మంది మరణించిన కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా ఇప్పుడు మమతతో పాటు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆర్ఎస్ గోయెంకా, మనీష్ గోయెంకా, ఆదిత్య అగర్వాల్.. ఈ ముగ్గురూ విదేశీ పర్యటన చేయడానికి కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మరీ మమత వెంట వెళ్తున్నారు.
ఇక తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇటీవలే ఎంపీగా ఎన్నికైన సినీ నటుడు దేవ్ కూడా ఈ పర్యటనలో ఉండటంపై విమర్శలు చెలరేగాయి. సినిమా తారలను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని బీజేపీ నాయకుడు సిద్ధార్థ నాథ్ సింగ్ నిలదీశారు. అయితే, సినీ పరిశ్రమకు కూడా విదేశీపెట్టుబడులు కావాలనే ఆయన్ను తీసుకెళ్లినట్లు టీఎంసీ నాయకుడు సౌగత రాయ్ చెప్పారు.