
‘రాహుల్ ఏదీ త్వరగా నేర్చుకోలేడు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేన్నైనా ఆలస్యంగా నేర్చుకుంటారనీ, అంత చురుకైన వ్యక్తి కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ మాత్రం చాలా వేగంగా అన్నీ నేర్చుకున్నారని, 1981లో రాజకీయాల్లోకి వచ్చి 1984లో ప్రధానమంత్రి అయ్యారని జైట్లీ వివరించారు. ప్రతిపక్షంలో రాహుల్‌కు పాత్ర ఉందని తాను అనుకోవడం లేదని జైట్లీ అన్నారు. మరోవైపు, కీలకమైన జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో అడ్డుకట్టపడిన నేపథ్యంలో జైట్లీ మరోసారి ఎగువసభపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్షంగా ఎన్నికైన లోక్‌సభకే ఎప్పటికీ అధిక ప్రాధాన్యం ఉండాలన్నారు.
ఆర్థిక విధాన నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఇలా ఎంతకాలం రాజ్యసభను ఉపయోగించుకుంటారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పరోక్షంగా ఎన్నికైన రాజ్యసభ.. ప్రత్యక్షంగా ఎన్నికైన లోక్‌సభ విజ్ఞతను ప్రశ్నిస్తుండడంతో భారత ప్రజాస్వామ్యానికి సవాలు ఎదురవుతోందని జైట్లీ గతంలో అన్నారు.