సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జోరుపెంచారు. ఇటీవల ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశమైన రాహుల్ శనివారం దేశవ్యాప్తంగా ఉన్న పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. రైతన్నల కష్టాలు, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి కీలకాంశాలను ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మలచుకోవాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రఫేల్ కుంభకోణమే ప్రధాన ప్రచారాంశంగా ఉంటుందన్న రాహుల్.. మోదీ ప్రభుత్వం తీసుకున్న రైతు, మహిళా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఒక కుటుంబం–ఒకే టికెట్
యువ నాయకత్వం కోసం పార్టీలోని సీనియర్ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో 2–3 సార్లు ఓటమిపాలైన నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓ కుటుంబానికి ఒక టికెట్’ మాత్రమే ఇస్తామనీ.. తమ సన్నిహితులు, కుటుంబసభ్యుల కోసం నేతలు లాబీయింగ్ చేయొద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నేతలంతా త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న నేతలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దన్నారు. తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడంపై ఆయా రాష్ట్రాల పీసీసీలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.
పొత్తులపై పీసీసీలకు పూర్తి స్వేచ్ఛ
లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి 25లోగా సమర్పించాలని పీసీసీ, సీఎల్పీ నేతలను రాహుల్ ఆదేశించారు. ఒక్కో లోక్‌సభ స్థానానికి గరిష్టంగా ముగ్గురు అభ్యర్థుల పేర్లను సూచించాలన్నారు. ఎన్నికల్లో విజయం కోసం స్థానిక, ఉపప్రాంతీయ పార్టీలతో పొత్తుల విషయంలో పీసీసీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. బూత్‌స్థాయిలో పార్టీని పటిష్టం చేసి ‘శక్తి యాప్’ ద్వారా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక సమస్యలపై దృష్టి సారించాలనీ, వాటిని ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీకి పంపాలని రాహుల్ సూచించారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని, యూపీఏ–1, యూపీఏ–2 హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో మోదీ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టాలన్నారు. భేటీ అనంతరం రాహుల్ స్పందిస్తూ..‘ఈరోజు సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యాను. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు సహా పలు అంశాలపై చర్చించాం’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment