కొత్త మిత్రులకు పరీక్ష | Rahul Gandhi, It's Time To Move | Sakshi
Sakshi News home page

కొత్త మిత్రులకు పరీక్ష

Published Sun, Feb 26 2017 2:19 AM | Last Updated on Tue, Aug 14 2018 5:02 PM

కొత్త మిత్రులకు పరీక్ష - Sakshi

కొత్త మిత్రులకు పరీక్ష

► రేపు యూపీ ఐదో దశ ఎన్నికలు
► అమేథీ సహా 51 స్థానాల్లో పోలింగ్‌

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఐదో దశ ఎన్నికలు కొత్త మిత్రులైన యువనేతలు రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌లకు పరీక్షగా నిలవనుంది. రాహుల్‌ సొంత ప్రాంతమైన అమేథీ సహా 11 జిల్లాల్లోని 51 స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. షెడ్యూలు ప్రకారం మొత్తం 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అలాపూర్‌లో ఎస్పీ అభ్యర్థి మృతితో 51 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2012 ఎన్నికల్లో ఈ 52 స్థానాల్లో వేర్వేరుగా పోటీచేసిన సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లలో, కాంగ్రెస్‌ ఐదు సీట్లలో గెలిచాయి.

తాజా ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఈ పార్టీలు నాటి విజయాన్ని పునరావృతం చేయడం రాహుల్, అఖిలేశ్‌ల ముందున్న సవాల్‌. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రావస్తి, బలరాంపూర్, సుల్తాన్ పూర్, అంబేడ్కర్‌నగర్‌ జిల్లాల్లో ఎస్పీ క్లీన్ స్వీప్‌ చేసింది. ఈసారి పరిస్థితి ఏకపక్షంగా లేకున్నా... త్రిముఖ పోరులో పొత్తు లాభంతో మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామని ఎస్పీ ధీమాతో ఉంది. ఐదో దశ బరిలో ఉన్న 9 మంది మంత్రులు గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

దోస్తీమే సవాల్‌..
ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు ధర్మానికి తిలోదకాలిచ్చి రాహుల్‌ ప్రతిష్టతో ముడిపడి ఉన్న అమేథి లో తమ అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభ ఎంపీ, రాజవంశీకుడు సంజయ్‌ సింగ్‌ రెండో భార్య అమితా సింగ్, బీజేపీ నుంచి సంజయ్‌ మొదటి భార్య గరిమా పోటీపడుతున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి ఎస్పీ టికెట్‌పై బరిలో ఉన్నారు.  అమేథి జిల్లాలోని మరో స్థానం గౌరిగంజ్‌లోననూ ఎస్పీ, కాంగ్రెస్‌లు పోటాపోటీగా అభ్యర్థులను నిలిపాయి.

బీఎస్పీ ఆశలు
తమ ముస్లిం– దళిత ఫార్ములాపై బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఐదోదశలో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో చాలాచోట్ల ముస్లిం, దళితులు కలిసి మొత్తం జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారు. బలరాంపూర్‌ జిల్లాలో 38 శాతం, బహ్రాయిచ్‌ జిల్లాలో 36 శాతం, సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాలో 30 శాతం ముస్లింలే. అందుకే ఈ దశలో 18 మంది ముస్లింలకు బీఎస్పీ టిక్కెట్లు ఇచ్చింది. బీజేపీని ఓడించగల స్థితిలో ఉన్న అభ్యర్థివైపు ముస్లింలు మొగ్గుతారని బీఎస్పీ ఆశిస్తోంది.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌


ఎన్నికలు జరిగే స్థానాలు:    51
బరిలో ఉన్న అభ్యర్థులు:    608
జిల్లాలు:    11
మొత్తం ఓటర్లు:    1.84 కోట్లు
పోలింగ్‌ బూత్‌లు:    19,167
గమనిక: 52 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎస్పీ అభ్యర్థి మృతితో అలాపూర్‌ ఎన్నిక మార్చి 9న జరగనుంది.

2012లో ఎవరికెన్ని స్థానాలు
ఎస్పీ          37
కాంగ్రెస్‌        5
బీజేపీ          5
బీఎస్పీ        3
పీస్‌ పార్టీ      2
మొత్తం      52

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement