న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో మహిళ భద్రతపై కూడా దృష్టి పెట్టింది. రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళా భద్రతకు టోల్ ఫ్రీ నెంబర్ 182 ను కేటాయించారు. రైళ్లలో ప్రయాణించే మహిళలు ప్రమాదం బారిన పడినప్పుడు తక్షణ సాయం పొందేందుకు ఈ నెంబర్ ను ప్రవేశపెట్టినట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దాంతో పాటు రైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
గురువారం రైల్వే మంత్రి సురేష్ ప్రభు సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ముందుగా మాట్లాడిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తరువాత ఎప్పటి మాదిరిగానే సుదీర్ఘ ప్రసంగాన్ని చదివిన ఆయన అందర్నీ అలరించేలా బడ్జెట్ ఉంటుందని తెలిపారు. రైల్వే కష్టాలకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సురేష్ ప్రభు పేర్కొన్నారు.