తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి
న్యూఢిల్లీ : రైల్వే బడ్జెట్పై కోటి ఆశలతో ఎదురుచూసిన తెలంగాణా, ఆంధ్ర ప్రజలకు మొండి చేయి ఎదురైంది. తెలుగు రాష్ట్రాలపై కొత్తమంత్రి సురేశ్ ప్రభు కూడా కనికరం చూపలేదు. రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టిన 2015 రైల్వే బడ్జెట్లో కొత్త రైళ్లూ లేవూ.. కొత్త లైన్లూ లేవు. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు చేసిన ప్రతిపాదనలన్నీ బుట్ట దాఖలయ్యాయి.
విశాఖ, తిరుపతి రైల్వే జోన్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను మంత్రి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వై ఫైలూ, ఎంటర్ టైన్ మెంటూ తప్ప, బడ్జెట్లో ఏమీ లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట-విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ ఏర్పాటు ఒక్కటే గుడ్డిలో మెల్ల. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన మంత్రి, తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పెండింగ్ లో ప్రాజెక్టుల ఊసే ఎత్తలేదు. ఆదాయంలో అగ్రభాగాన నిలిచే దక్షిణ మధ్య రైల్వేస్ .. కేటాయింపుల్లో శూన్యంగా మిగిలిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా కేంద్రం పట్టించుకోలేదు.