► అంతా జనం హడావుడి.. గజిబిజి.. రైలొచ్చిందంటే చాలు.. దిగేవారు.. ఎక్కేవారితో.. కిక్కిరిసిపోతుంది.. ఇరుకిరుకు వెయిటింగ్ హాళ్లు.. బాత్రూంల సంగతైతే చెప్పనక్కర్లేదు.. రైల్వేస్టేషన్ అంటే మనకు గుర్తొచ్చేది ఇదే..
► ఇప్పుడీ ఫొటోల మీద ఓ లుక్కేసుకోండి.. ఇవి ఎయిర్‌పోర్టుల డిజైన్లు కావు.. రైల్వేస్టేషన్లవే.. ఇందులో అత్యాధునిక సదుపాయాలున్న వెయిటింగ్ హాళ్లు, రద్దీ లేకుండా.. ప్రయాణికులు రావడానికి, పోవడానికి వేర్వేరు టెర్మినళ్లు.. ఎయిర్‌పోర్టుల్లో ఉండే విలాసవంతమైన సౌకర్యాలు, షాపింగ్‌మాళ్లు, మల్టీప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, చిన్నస్థాయి ఆస్పత్రులు, మెట్రో.. బస్సులతో కనెక్టివిటీ.. ఒకటా రెండా అన్నీనూ.. వీవీఐపీల కోసం హెలీపాడ్ కూడా ఉంటుంది.. ఇవన్నీ మన రైల్వేస్టేషన్లలోనే..
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్ల ప్రాజెక్టులో భాగంగా ఇవన్నీ సాధ్యమేనంటున్నారు రైల్వే అధికారులు.. ఈ చిత్రాలు గుజరాత్‌లోని సూరత్, మధ్యప్రదేశ్‌లోని హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్లవి.. ప్రపంచస్థాయి రైల్వేస్టే షన్లుగా తయారుచేయడంలో భాగంగా వీటినిలా మార్చేస్తారన్నమాట. దేశంలోనే తొలి ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా మారబోతున్న హబీబ్‌గంజ్‌లో ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. కనీసం వెయ్యి వాహనాలకు సరిపోయేలా ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. మరికొన్ని స్టేషన్ల పనులు బిడ్ల దశలో ఉన్నాయి. దేశంలోని పలు స్టేషన్లను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లుగా మార్చేందుకు ఫ్రాన్స్, బెల్జియం, జపాన్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
ఇవి ఎయిర్‌పోర్టుల డిజైన్లు కావు..
Published Sat, Jul 2 2016 4:21 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement