రైల్వే బాదుడు | Train charges are increased | Sakshi
Sakshi News home page

రైల్వే బాదుడు

Published Sat, Jun 21 2014 3:26 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

రైల్వే బాదుడు - Sakshi

రైల్వే బాదుడు

బెల్లంపల్లి : కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీలు పెంచి ప్రయాణికుల నడ్డి విరిచింది. ప్రయాణికుల చార్జీలు, సరుకుల రవాణా చార్జీలు భారీగా పెంచేసింది. పెంచిన చార్జీలు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ సర్కారు తొలుత రైల్వే చార్జీల పెంపుపై దృష్టి సారించింది. ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం చొప్పున పెంచుతూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. పెంచిన ప్రయాణ, సరుకు రవాణా చార్జీల వల్ల జిల్లా ప్రయాణికులపై ఏడాదికి సుమారు రూ.11.52 కోట్లు భారం పడే అవకాశాలు ఉన్నాయి.
 
ప్రయాణ భారం
జిల్లాలో పది ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. మంచి ర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), రేచిని, ఆసిఫాబాద్ రోడ్(రెబ్బెన), ఆదిలాబాద్, బాసర తదితర రైల్వేస్టేషన్ల నుంచి రోజువారీగా సుమారు 16 వేలకు పైబడి మంది ప్రయాణికులు   సుదూర ప్రాంతాలకు రాకపోకలు చేస్తుంటారు. ఆ ప్రాతిపదికన నెలకు 5 లక్షల వరకు ప్ర యాణికులు ప్రయాణం సాగిస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్ర యాణికుల చార్జీలు పెంచి ప్రభుత్వం నడ్డి విరిచే చర్యలకు పూనుకుంది.
 
జిల్లాలోని పలు ప్రాంత ల నుంచి ప్రయాణికులు అత్యధికంగా హైదరాబాద్, వరంగల్, గుంటూర్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నాగ్‌పూర్, న్యూఢిల్లీ ప్రాంతాలకు వెళ్తుంటారు. పెంచిన 14.2 శాతం చార్జీల వల్ల జిల్లాలోని ప్రయాణికులపై రోజుకు సగటున రూ.25 వేల వరకు భారం పడనున్నట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా అం చనా వేశారు. ఆ లెక్కన ప్రయాణికుల నుంచి ఏడాదికి రూ.9 కోట్లు రైల్వేకు ఆదాయం సమకూరనుంది. ఒక్కసారిగా భారీ స్థాయిలో పెరిగిన రైలు చార్జీలు ప్రయాణికులకు గుదిబండగా మారనున్నాయి.
 
సరుకు రవాణా భారం రూ. 2.52 కోట్లు
రైల్వే ప్రయాణికుల చార్జీల పెంపుతోపాటు సరుకుల చార్జీలను ప్రభుత్వం ఎడాపెడా పెంచేసింది. జిల్లా నుంచి రోజువారీగా భారీస్థాయిలో బొగ్గు, సిమెంట్ రవాణా జరుగుతుంటాయి. గనుల నుంచి ఉత్పత్తి చేసిన బొగ్గును రైల్వే వ్యాగన్ల ద్వారా ఫ్యాక్టరీలకు, విద్యుత్  ఉత్పత్తి కేంద్రాలకు రవాణా చేస్తుంటారు. మంచిర్యాల రైల్వేస్టేషన్ నుంచి నెలకు దాదాపు 100 ర్యాకులు(42 లక్షల టన్నుల చొప్పున) బొగ్గు కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్‌టీపీసీకి ఎగుమతి అవుతుంది. అదే మాదిరి మందమర్రి రైల్వేస్టేషన్ నుంచి నెలకు 10 ర్యాకులు (3 లక్షల 60 వేల టన్నులు చొప్పున) సిమెంట్ ఇతర ప్రాంతాలకు రవాణా జరుగుతుంది.
 
సరుకు రవాణా జరగడానికి రైల్వే శాఖ పరిశ్రమలకు 50 శాతం కన్సెషన్‌ను వర్తింపజేస్తుంది. అయినప్పటికిని 6.5 శాతం సరుకు రవాణా చార్జీలను పెంచడం వల్ల రోజుకు సుమారు రూ.70 వేల వరకు అదనపు భారం పడనుంది. ఆ ప్రాతిపదికన ఏడాదికి రూ.2.52 కోట్లు సరుకు రవాణా చార్జీలను పరిశ్రమల నుంచి రైల్వే శాఖ వసూలు చేయనుంది. రైల్వే ప్రయాణికులకు సదుపాయాలు, కొత్త రైళ్లను ప్రవేశపెట్టి ఇక్కట్లను తీర్చాల్సిన ప్రభుత్వం ఉరుములేని మెరుపులాగా ప్రయాణికుల చార్జీలు, సరుకుల చార్జీలు పెంచింది. పెంచిన చార్జీలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల చార్జీలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement