న్యూఢిల్లీ: సెమీ హైస్పీడ్ ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ల తయారీకి చైనా నుంచి వచ్చే బిడ్లను పరిశీలనకు తీసుకోకూడదని భారత రైల్వే భావిస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు చైనా ప్రభుత్వానికి చెందిన సీఆర్ఆర్సీ ప్రయత్నిస్తోంది. దాదాపు 1500 కోట్ల రూపాయలతో 44 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను నిర్మించే ఈ ప్రాజెక్టుకు బిడ్ దాఖలు చేసిన ఏకైక విదేశీ కంపెనీ కూడా ఇదే కావడం గమనార్హం.(మరోసారి చైనాపై ఆగ్రహం ప్రదర్శించిన ట్రంప్)
గతేడాది డిసెంబర్లో చెన్నైకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) ఈ ప్రాజెక్టు కోసం మూడోసారి గ్లోబల్ టెండర్లను పిలిచింది. దీనికి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, హైదరాబాద్‌కు చెందిన మేధా గ్రూప్, ఎలక్ట్రోవేవ్స్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబైకి చెందిన పవర్నెటిక్స్ ఎక్విప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలు గత వారం బిడ్ చేశాయి. ఇందులో చైనాకు చెందిన సీఆర్ఆర్సీ కూడా ఉంది.(శవ ‘సంస్కారం’ లేని చైనా!)
అంతకుముందు దాఖలు చేసిన టెండర్లకు అంతర్జాతీయ కంపెనీలైన అల్స్టోమ్, బాంబార్డియర్, టాల్గో, మిత్సుబిషి, సిమెన్స్ బిడ్లు వేశాయి. కానీ ఈసారి అవి ఎలాంటి బిడ్లూ వేయలేదు.‘మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భార్ మిషన్లకు అనుగుణంగానే సీఆర్ఆర్సీని బిడ్డింగ్ నుంచి తప్పించాలనుకుంటున్నాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసరు ఒకరు తెలిపారు.(వివాదాస్పద ప్రాంతాల నుంచి వెనక్కి మళ్లాల్సిందే..)
ఆల్ ఇండియా ట్రేడర్స్ వ్యతిరేకత
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో చైనా బిడ్ దాఖలు చేయడంపై ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసింది. మేక్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకు వెళ్దామని, చైనా కంపెనీ బిడ్‌ను పరిగణలోకి తీసుకోకూడదని కోరింది. 2016లో సిగ్నలింగ్ కోసం చైనా కంపెనీతో చేసుకున్న 471 కోట్ల రూపాయల ఒప్పందాన్ని రైల్వే గత నెలలో రద్దు చేసుకుంది.
‘ట్రైన్18’ కేరాఫ్ కాంట్రవర్సీ
ఇంజిన్ లేకుండా నడిచే తొలి భారతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్ 18’. దీని వేగం దాదాపు 180 కిలోమీటర్లు. దీన్ని ఐసీఎఫ్ తయారు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఫిబ్రవరిలో స్వయంగా ఆరంభించారు. ఆ తర్వాత ఐసీఎఫ్‌లోని మెకానికల్ డిపార్టుమెంటు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు రైలును తయారుచేసిన ఘనత తమదంటే తమదని వాదులాడుకున్నాయి.
ఫలితంగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసుకున్న రైలును, విదేశీయుల చేత తయారు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 44 కొత్త రైళ్ల కోసం ఐసీఎఫ్ తొలుత బిడ్లను పిలించింది. ఏమైందో ఏమో అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. మళ్లీ బిడ్లను పిలిచింది. అది కూడా అనివార్య కారణాలతో రద్దైంది.
Comments
Please login to add a commentAdd a comment