
తెరిపిన పడ్డ కశ్మీర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కాస్త తెరిపిన పడింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురవలేదు. జీలం నది కూడా శాంతించింది. వరదల కారణంగా మరణించినవారి సంఖ్య మంగళవారం నాటికి 17కు చేరింది. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వానలు తగ్గుముఖం పట్టినా మళ్లీ కురవొచ్చన్న వాతావరణ శాఖ సూచనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో వర్షాలు పడొచ్చని అధికారులు ప్రకటించారు. బుద్గామ్ జిల్లా లాడెన్‌లో నాలుగు ఇళ్లపై కొండచరియలు విరిగి పడిన ఘటనలో సహాయక సిబ్బంది సోమవారం రాత్రి వరకు 10 మృతదేహాలను వెలికితీయగా.. మంగళవారం మరో ఆరు వెలికితీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 16కు చేరుకుంది. ఉధంపూర్‌లో ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయి మరణించాడు. ప్రధాని ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ.. వరదల తాజా పరిస్థితిపై ఢిల్లీలో మోదీకి నివేదిక అందజేశారు.