
జైపూర్: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చల్లారడం లేదు. వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్తాన్ తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఇలాగే చేశాయి. అయితే రాజస్తాన్‌లో సభలో తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో.. అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. సీఏఏను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. ఇదే విషయంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
అంతకుముందు రాజస్తాన్ కేబినెట్ సీఏఏ వ్యతిరేక ప్రతిపాదనను ఓ సర్క్యులేషన్ ద్వారా ఆమోదించింది. ఈ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు చేయబోదని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. సంవిధాన్ బచావో ర్యాలీ పేరిట ఈ చట్టాన్ని నిరసిస్తూ ఈ నెల 22 న జరిగిన ఓ ర్యాలీకి ఆయన నేతృత్వం వహించడం కూడా విశేషం. ('రాహుల్.. దమ్ముంటే సీఏఏపై 10 వాక్యాలు మాట్లాడు')