
న్యూఢిల్లీ: తన కారుకు దారివ్వలేదని ఆ ఎమ్మెల్యే కొడుక్కి కోపం వచ్చింది. అంతే, ఎదురుగా వెళ్తున్న ఆ కారును ఢీకొట్టడంతోపాటు డ్రైవర్‌పై ముష్టిఘాతాలు కురిపించాడు. రాజస్తాన్‌లోని బన్స్‌వారాలో జూన్ ఒకటో తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తాజాగా హల్‌చల్ చేస్తోంది. అధికార బీజేపీ ఎమ్మెల్యే ధన్‌సింగ్ రావత్ కుమారుడు రాజా బన్స్‌వారాలోని విద్యుత్ కాలనీ ప్రాంతం గుండా తన ఎస్‌యూవీలో వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న స్విఫ్ట్ కారును ఓవర్‌టేక్ చేసేందుకు యత్నించగా సాధ్యం కాలేదు.
హారన్ కొట్టినా పక్కకు తొలగలేదు. దీంతో ఆ కారును ఢీకొట్టి, ఆగిన తర్వాత రద్దీగా ఉన్న ఆ రోడ్డు మధ్యలోనే రాజా ఎస్‌యూవీను నిలిపి ఉంచాడు. తన వాహనం నుంచి కిందికి దిగి స్విఫ్ట్ డ్రైవర్‌ను బయటకు లాగి పదేపదే కొట్టాడు. వెంట ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా అతనికి సహకరించారు. ఈ ఘ టనకు సంబంధించి సీసీటీవీ కెమెరా ఫుటేజి తాజాగా బయటకు వచ్చింది. దీనిపై బాధితుడు నీరవ్ ఉపాధ్యాయ్ స్పందించాడు. ‘అది వన్‌వే రోడ్డు. ఓవర్‌టేక్ చేయటానికి అక్కడ వీలు పడదు.
మా మధ్య వాగ్వాదం మాత్రమే జరిగింది. ఈ ఘటనపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకోలేదు’అని తెలిపాడు. ‘ఎమ్మెల్యే కొడుకైనా మరెవరైనా సరే మేం చర్యలు తీసుకుంటాం. కానీ, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు మాకు అందలేదు’అని పోలీస్ ఎస్సై చందన్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment