ఫోటో షూట్‌ పిచ్చి: లోయలోకి దూకేసిన కొత్త జంట వీడియో వైరల్ | Rajasthan Couple Jumps From Rail Bridge Into 90 Feet Gorge As Train Arrives During Photo Shoot | Sakshi
Sakshi News home page

ఫోటో షూట్‌ పిచ్చి: లోయలోకి దూకేసిన కొత్త జంట వీడియో వైరల్

Jul 15 2024 10:46 AM | Updated on Jul 15 2024 10:54 AM

Rajasthan Couple Jumps From Rail Bridge Into 90 Feet Gorge As Train Arrives During Photo Shoot

ఫోటోలు, రీల్స్‌ పిచ్చి ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన అనేక విషాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొంతమంది తీరుమారడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని పాలిలో ఫోటో షూట్ సమయంలో జరిగిన ప్రమాదం సంచలనం రేపింది. ఇరుకుగా ఉన్న రైలు పట్టాలపై ఫోటోషూట్‌ తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న  ఘటన షాకింగ్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే..  రాజస్థాన్‌లోని పాలి సమీపంలోని గోర్మ్ ఘాట్ వద్ద పురాతన రైల్వే వంతెన ఉంది. చుట్టూ  పచ్చని ప్రకృతితో ఇక్కడి  వాతావరణం  ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి చాలామంది సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజస్థాన్‌లోని బాగ్దీ నగర్‌కు చెందిన కొత్త జంట రాహుల్ మేవాడ (22), భార్య జాహ్నవి (20) కూడా ఈ ప్రదేశానికి వచ్చారు. వీరికి తోడుగా రాహుల్ సోదరి, ఆమె భర్త వచ్చారు. నలుగురూ కలిసి బ్రిడ్జిపై ఫొటో షూట్ చేసుకునే ఉత్సాహంతో మీటర్ గేజ్ ట్రాక్‌పైకి చేరుకున్నారు.  పరిసరాలను మైమరిచి ఫోటోలకు ఫోజులిస్తుండగా  రైలు దూసుకొచ్చింది.   ప్రమాదాన్ని పసిగట్టిన రాహుల్ సోదరి, ఆమె భర్త ట్రాక్‌పై నుంచి పక్కకు వచ్చేసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొత్త జంట మాత్రం రైలు  సమీపానికి వచ్చేదాకా  విషయాన్ని గమనించలేదు.

ఇక ఏం చేయాలో అర్థంకాక, రైలు పట్టాలకింద నుజ్జు నుజ్జు కావడం ఖాయం, పక్కనున్న లోయలోకి దూకడం తప్ప వేరే మార్గం లేదని గమనించిన ఆ జంట చేయి చేయి పట్టుకొని 90 అడుగుల లోయలోకి దూకేసింది.   ప్రస్తుతం తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.  రాహుల్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జోధ్‌పూర్ ఆస్పత్రికి తరలించినట్టు  తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement