
కరౌలీ : విద్యా, ఉద్యోగాల్లో అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేయలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఎట్టకేలకు రాజస్థాన్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గుజ్జర్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. గుజ్జర్లతో బహిరంగ చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ధోల్‌పూర్ జిల్లాలో జరిగిన అల్లర్లపై విచారణ జరపనున్నట్లు సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో అయిదు శాతం రిజర్వేషన్ కోరుతూ గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రైలు పట్టాలపై బైఠాయించి ధర్నాకు దిగటంతో రైల్వేశాఖ... ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించింది.
రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ నేతృత్వంలో ప్రభుత్వ ప్రతినిధుల బృందం నిన్న గుజ్జర్లతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనకారులు ఆగ్రా-మొరేనా రహదారి దిగ్భందించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనలు ఉద్రిక్తతలకు దారి తీయడంతో ధోలాపూర్, కరౌలీ జిల్లాల్లో 144 సెక్షన్ అమలు అవుతోంది. కాగా రిజర్వేషన్లు అమలు చేసేంతవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని గుజ్జర్ల ఆరక్షన్ సంఘర్షణ్ సమితి అధ‍్యక్షుడు కిరోరీ సింగ్ భైంస్లా స్పష్టం చేశారు. తమ ఆందోళనలోకి సంఘ విద్రోక శక్తులు చొరబడ్డాయని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు భైంస్లా తన ఆందోళన విరమించాలంటూ ఆయన నివాసంలో రాజస్థాన్ సర్కార్ నోటీసులు అంటించింది.
Comments
Please login to add a commentAdd a comment