Gujjars Protest
-
12ఏళ్లుగా ఆందోళన: వారి డిమాండ్ ఎందుకు నెరవేరలేదు?
సాక్షి, న్యూఢిల్లీ : విద్యా, ఉద్యోగ రంగాల్లో తమకూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ గత ఐదు రోజులుగా రాజస్థాన్‌లోని మలర్నా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ? గుజ్జర్లకు తప్పకుండా ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామంటూ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుజ్జర్ల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? 2006 నుంచి, అంటే పన్నెండేళ్లుగా గుజ్జర్లు ఆందోళన చేస్తున్నా వారి డిమాండ్ ఇప్పటి వరకు ఎందుకు నెరవేరలేదు? ఎస్టీల్లాగా తమకు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ 2006లో కరౌలి ప్రాంతంలోని రైలు పట్టాలపై పదవీ విరమణ చేసిన సైనికుడు కిరోరి సింగ్ భైన్సాలా నాయకత్వాన గుజ్జర్లు ఆందోళన చేశారు. అప్పుడు ఎలాంటి ఫలితం రాలేదు. వారు ఆ మరుసటి సంవత్సరం కూడా రైలు పట్టాలపై ఆందోళన చేయగా, పోలీసులు జరిపిన కాల్పుల్లో 26 మంది గుజ్జర్లు చనిపోయారు. అప్పుడు గుజ్జర్ల డిమాండ్‌ను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ జస్రాజ్ చోప్రా ఆధ్వర్యాన ఓ కమిటీని వేసింది. ఇతర వెనకబడిన వర్గాల వారికి కేటాయించిన 21 శాతం రిజర్వేషన్ల కారణంగా గుజ్జర్లు లబ్ధి పొందుతున్నందున వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు అవసరం లేదని తేల్చింది. ఎస్టీల కింద రిజర్వేషన్లు కల్పించడం కుదరకపోతే ప్రత్యేక వెనకబడిన తరగతుల కేటగిరీ కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ భైన్సాలా మళ్లీ 2008 రైలు రోకో ఆందోళన చేపట్టారు. అప్పుడు కూడా అది హింసాత్మకంగా మారడంతో ఓ పోలీసు సహా 36 మంది మరణించారు. 2010లో ఇదే అశోక్ గెహ్లాట్, బైన్సాలాతో చర్చలు జరిపి గుజ్జర్లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు యాభై శాతానికి చేరుకోవడంతో అంతకుమించి ఆయన రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు. తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కావాల్సిందేనంటూ గుజ్జర్లు 2015లో మరోసారి రైలు రోకో ఆందోళన చేపట్టారు. దాంతో అప్పటి వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక వెనకబడిన తరగతుల చట్టాన్ని తీసుకొచ్చింది. రిజర్వేషన్లు అప్పటికే యాభై శాతం ఉన్నాయన్న కారణంగా ఆ చట్టాన్ని రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వారిని మెప్పించేందుకు 2017లో వసుంధర రాజె ప్రభుత్వం ఇతర వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను 21 శాతం నుంచి 26 శాతానికి పెంచుతూ చట్టం తెచ్చింది. దాన్నీ హైకోర్టు కొట్టివేసింది. మొన్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుజ్జర్లకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సచిన్ పైలట్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. గుజ్జర్లతోపాటు మరికొన్ని సామాజిక వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో 20 రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించాలంటూ గెహ్లాట్ ప్రభుత్వానికి భైన్సాలా అల్టిమేటం జారీ చేశారు. 20 రోజుల గడువు కాలం పూర్తవడంతో ఐదు రోజుల క్రితం గుజ్జర్లు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఇప్పటికే దేశంలో యాభై శాతం రిజర్వేషన్లు మించిపోయినప్పటికీ దేశంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చినప్పుడు తమ డిమాండ్‌ను మాత్రం ఎందుకు నెరవేర్చలేదని ‘గుజ్జార్ అరక్షన్ సంఘర్ష్ సమితి’ ప్రధాన కార్యదర్శి షైలేంద్ర సింగ్ ప్రశ్నిస్తున్నారు. గుజ్జర్ల విషయంతో తామేమి చేయలేమని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని గెహ్లాట్ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ విషయాన్ని తన మేనిఫెస్టోలో పేర్కొందని బీజేపీ ప్రశ్నిస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందిగా ప్రస్తుతం గెహ్లాట్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. -
గుజ్జర్ల ఆందోళన : కేంద్రం కోర్టులోకి కోటా బంతి
జైపూర్ : కోటా కోసం ఆందోళన చేపట్టిన గుజ్జర్లతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్న రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కొద్దిసేపటికే బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టివేశారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోరుతూ కొద్దిరోజులుగా గుజ్జర్లు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. గుజ్జర్ల కోటా నిరసనలపై స్పందించిన సీఎం అశోక్ గెహ్లాట్ సోమవారం ఉదయం తొలుత చర్చలకు సిద్దమని ప్రకటించిన గెహ్లోత్ అనంతరం దీనిపై కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాలని దాటవేశారు. గుజ్జర్లకు సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే గుజ్జర్లు తమ గొంతును కేంద్రానికి గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందని, కోటా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. గుజ్జర్లు తమ ఆందోళనలో భాగంగా హింసకు పాల్పడటం సరైంది కాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కోరుతూ గుజ్జర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తమను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించరాదని, పరిస్థితి చేయి దాటితే ప్రభుత్వమే తదుపరి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుజ్జర్ల ఉద్యమ నేత కిరోరి సింగ్ భైంస్లా హెచ్చరించారు. -
రాజస్థాన్ ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక
కరౌలీ : విద్యా, ఉద్యోగాల్లో అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేయలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఎట్టకేలకు రాజస్థాన్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గుజ్జర్లతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. గుజ్జర్లతో బహిరంగ చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ధోల్పూర్ జిల్లాలో జరిగిన అల్లర్లపై విచారణ జరపనున్నట్లు సీఎం గెహ్లాట్ పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో అయిదు శాతం రిజర్వేషన్ కోరుతూ గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రైలు పట్టాలపై బైఠాయించి ధర్నాకు దిగటంతో రైల్వేశాఖ... ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లించింది. రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ నేతృత్వంలో ప్రభుత్వ ప్రతినిధుల బృందం నిన్న గుజ్జర్లతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనకారులు ఆగ్రా-మొరేనా రహదారి దిగ్భందించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనలు ఉద్రిక్తతలకు దారి తీయడంతో ధోలాపూర్, కరౌలీ జిల్లాల్లో 144 సెక్షన్ అమలు అవుతోంది. కాగా రిజర్వేషన్లు అమలు చేసేంతవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని గుజ్జర్ల ఆరక్షన్ సంఘర్షణ్ సమితి అధ్యక్షుడు కిరోరీ సింగ్ భైంస్లా స్పష్టం చేశారు. తమ ఆందోళనలోకి సంఘ విద్రోక శక్తులు చొరబడ్డాయని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు భైంస్లా తన ఆందోళన విరమించాలంటూ ఆయన నివాసంలో రాజస్థాన్ సర్కార్ నోటీసులు అంటించింది. -
హింసాత్మకంగా మారిన గుజ్జర్లు ఆందోళన
-
కోటా రగడ : వాహనాలకు నిప్పంటించిన గుజ్జర్లు
జైపూర్ : విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ రాజస్ధాన్‌లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఆదివారం ఘర్షణ చెలరేగడంతో దోల్పూర్ హైవే రణరంగమైంది. జాతీయ రహదారిని నిర్భందించిన నిరసనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. సవోయి మధోపూర్ జిల్లాలో వరుసగా మూడోరోజూ రైలు పట్టాలపై గుజ్జర్లు ధర్నా నిర్వహించి కోటా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, గుజ్జర్ల ఆందోళనతో వెస్ట్ సెంట్రల్ రైల్వే గత రెండు రోజులుగా ఈ ప్రాంతం మీదుగా వచ్చే రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్లను దారిమళ్లించింది. తమకు తక్షణమే ప్రత్యేక కేటగిరీ కింద 5 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించాలని గుజ్జర్ల ఉద్యమ నేత కిరోరి సింగ్ భైంస్లా డిమాండ్ చేశారు. రాజస్ధాన్ ప్రభుత్వం గతంలో గుజ్జర్లకు అత్యంత వెనుకబడిన వర్గాల కోటా కింద ఒక శాతం రిజర్వేషన్ ప్రకటించింది. -
కోటా కోసం మళ్లీ గుజ్జర్ల ఆందోళన
జైపూర్ : రాజస్ధాన్‌లో గుజ్జర్లు రిజర్వేషన్ కోరుతూ మళ్లీ ఆందోళన బాట పట్టారు. విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ శుక్రవారం సవాయి మధోపూర్ జిల్లాలో ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై కూర్చుని రైళ్ల రాకపోకలను అడ్డగించారు. ఐదు శాతం రిజర్వేషన్ కోసం తాము చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము తిరిగి ఆందోళన చేపట్టామని, తమ కోటాను ప్రభుత్వం ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందేనని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లా డిమాండ్ చేశారు. ప్రస్తుతం గుజ్జర్లు, రైకా-రెబరి, బంజారాలకు 50 శాతం కోటాలోనే అత్యంత వెనుకబడిన వర్గాల కింద ప్రత్యేకంగా ఒక శాతం రిజర్వేషన్ అమలవుతోంది. అయితే తమ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్లు జనవరిలో రాజస్ధాన్ ప్రభుత్వానికి 20 రోజుల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు. డెడ్‌లైన్ ముగియడంతో సవాయి మధోపూర్ జిల్లాలో గుజ్జర్లు మహాపంచాయత్ పేరిట భేటీ అయి ఆందోళన చేపట్టారు. -
10 రైళ్లు రద్దు.. 57 దారి మళ్లింపు
జైపూర్: రాజస్థాన్‌లో గుజ్జర్ల బంద్ కారణంగా 10 ఆ రాష్ట్రం మీదుగా వెళ్లాల్సిన 10 రైళ్లను రద్దు చేశారు. మరో 57 రైళ్లను దారిమళ్లించారు. భరత్పూర్ జిల్లాలో 1000 మంది గుజ్జర్లు రైలు పట్టాలపై కూర్చొని ఆందోళన చేస్తున్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గుజ్జర్లు రోడ్లు, రైల్వే ట్రాక్‌లను నిర్బంధించారు. గుజ్జర్లతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే రిజర్వేషన్లు కల్పించే విషయం కోర్టు పరిధిలో ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే చెప్పారు.