జైపూర్ : కోటా కోసం ఆందోళన చేపట్టిన గుజ్జర్లతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్న రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కొద్దిసేపటికే బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టివేశారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోరుతూ కొద్దిరోజులుగా గుజ్జర్లు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. గుజ్జర్ల కోటా నిరసనలపై స్పందించిన సీఎం అశోక్ గెహ్లాట్ సోమవారం ఉదయం తొలుత చర్చలకు సిద్దమని ప్రకటించిన గెహ్లోత్ అనంతరం దీనిపై కేంద్ర ప్రభుత్వమే ఓ నిర్ణయం తీసుకోవాలని దాటవేశారు.
గుజ్జర్లకు సహకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే గుజ్జర్లు తమ గొంతును కేంద్రానికి గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందని, కోటా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. గుజ్జర్లు తమ ఆందోళనలో భాగంగా హింసకు పాల్పడటం సరైంది కాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కోరుతూ గుజ్జర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తమను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించరాదని, పరిస్థితి చేయి దాటితే ప్రభుత్వమే తదుపరి పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుజ్జర్ల ఉద్యమ నేత కిరోరి సింగ్ భైంస్లా హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment