
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమ అమలుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, మహారాష్ట్రలు నిరాసక్తత వ్యక్తం చేశాయి. ఈ తరహా బీమా పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్న క్రమంలో మోదీ కేర్‌గా పేరొందిన ఆయుష్మాన్ భవను అమలు చేయలేమని ఈ రాష్ట్రాలు చేతులెత్తేశాయి. మోదీ కేర్ కింద దేశవ్యాప్తంగా పదివేల పేద కుటుంబాలకు రూ 5 లక్షల వార్షిక ఆరోగ్య బీమా కవరేజ్‌ను వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రాజస్తాన్ ప్రభుత్వం కేంద్ర పథకాన్ని స్వాగతిస్తోందని..అయితే రాష్ట్రంలో ఇప్పటికే 4.5 కోట్ల మందికి భామషా స్వాస్థ్య బీమా యోజన పేరుతో నగదు రహిత ఆరోగ్య సేవలను అందిస్తున్న క్రమంలో ఈ పథకాన్ని ఎలా వర్తింపచేస్తారో తమకు తెలియదని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుత పథకం దెబ్బతినకుండా రెండు స్కీమ్‌లను ఎలా అమలుచేయాలనే దానిపై కసరత్తు సాగుతున్నదని అన్నారు. ఈ అంశంపై ఆయుష్మాన్ భారత్ సీఈవో డాక్టర్ ఇందు భూషణ్ సీఎం వసుంధరా రాజేతో చర్చించారని చెప్పారు.
నిధుల కొరత కారణంగా తాము ఆయుష్మాన్ భవ పథకాన్ని చేపట్టలేమని మహారాష్ట్ర ప్రభుత్వం అశక్తత వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే జన్ ఆరోగ్య యోజన పేరిట 2.2 కోట్ల కుటుంబాలకు రూ 2 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తోంది. మరోవైపు కేంద్ర పథకాన్ని అమలు చేయలేమని ఒడిషా ప్రభుత్వం సైతం తేల్చిచెప్పింది. తాము ఇప్పటికే బిజు స్వాస్థ్య కళ్యాణ్ యోజన పేరుతో అత్యధిక మందికి ఆరోగ్య బీమా వర్తింపచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.