
దేవిక దేశానికే గర్వకారణం
న్యూఢిల్లీ: జికా వైరస్ ను గుర్తించిన పరిశోధనా బృందంలో భాగమైన వైద్య విద్యార్థినిని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన డాక్టోరల్ విద్యార్ధిని దేవికా సిరోహి (29) కొనియాడుతూ బుధవారం ఆయన ట్విట్ చేశారు. జికా వైరస్ ను విజయవంతంగా డీకోడ్ చేసిన అమెరికా విశ్వవిద్యాలయ పరిశోధన బృందంలో మీరట్ కు చెందిన దేవికా భాగస్వామిగా ఉండడం సంతోషంగా ఉందన్నారు.
ఇది ఆమె కుటుంబానికే కాకుండా, దేశానికి కూడా గర్వకారణంగా నిలిచిందంటూ కేంద్రమంత్రి ప్రశంసించారు. దేవికా సిరోహి సాధించిన ఈ విజయం ఆడపిల్లల విద్యా ప్రాముఖ్యతను మరోసారి తెలియజేసిందన్నారు. 'బేటీ బచావో , బేటీ పడావో' పై దృష్టి పెట్టాలంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరోవైపు తమ ఏడుగురి పరిశోధకుల బృందంలో దేవికా అతి చిన్న వయస్కురాలని అమెరికాకు పురుద్వే యూనివర్శిటీ తెలిపింది. జికా వైరస్ నిర్మాణాన్ని గుర్తించడం ఇదే మొదటి సారని పేర్కొంది.
ముగ్గురు ప్రొఫెసర్లు, నలుగురు విద్యార్థులు పాల్గొన్న ఈ సంచలన పరిశోధనలోతాను కూడా ఉండడం ఆనందంగా ఉందని దేవిక సంతోషం వ్యక్తం చేసింది. ఈ ప్రాణాంతకమైన వైరస్ ను ఛేదించడంలో తాము చాలా కష్టపడ్డామని, రోజుకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవాళ్లమని తెలిపింది. తమ పరిశోధన ఫలించి విజయం సాధించడం గర్వంగా ఉందని పేర్కొంది.
Ms Sihori has not only made her family proud but also the country feels proud of her achievement. Congratulations to her family as well.
— Rajnath Singh (@BJPRajnathSingh) 6 April 2016