పోలవరం బిల్లుకు బ్రేక్
పోలవరం బిల్లుకు బ్రేక్
Published Tue, Jul 8 2014 1:49 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
బిల్లును చేపట్టవద్దని లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర హోంమంత్రి వినతి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ముంపునకు గురయ్యే మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు చట్టరూపం కల్పించేందుకు ప్రవేశపెట్టదలచిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు - 2014కు బ్రేక్ పడింది. సోమవారం లోక్‌సభ కార్యక్రమాల్లో 6, 7 క్రమసంఖ్యల కింద ఉన్న ఈ అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక ప్రకటన చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు - 2014ను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద రాష్ట్రపతి సిఫారసును పొందే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది. అందువల్ల ఎజెండాలోని 6, 7 అంశాలను తీసుకోవద్దు’’ అని స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు. ఎజెండాలోని ఈ అంశం లోక్‌సభ నిబంధనల్లోని 72వ నిబంధనను ఉల్లంఘిస్తోందని అంతకుముందు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు టీఆర్‌ఎస్ సభ్యుడు నోటీసులిచ్చారు.
ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని ఆ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రాల సరిహద్దులు మార్చాలంటే ఆర్టికల్ 3 కింద ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి బిల్లు ఏదైనా రాష్ట్రపతి ఆమోదం లేకుండా సభలో ప్రవేశపెట్టకూడదన్నారు. అందువల్ల దీనిపై 72వ నిబంధన కింద చర్చించాలని, ఆ తరువాతే బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన ఈ నోటీసు కారణంగానే హోంమంత్రి పై ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి సిఫారసు వచ్చాకే బిల్లును తిరిగి సభలో ప్రవేశపెట్టనున్నట్టు అవగతమవుతోంది.
Advertisement