
రాజ్యసభలో కీలక పరిణామం
న్యూఢిల్లీ : రాజ్యసభలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై ఇవాళ కూడా సభలో గందరగోళం నెలకొంది. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు... హెరాల్డ్ వ్యవహారంపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని డిప్యూటీ చైర్మన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
దీంతో పదే పదే సభను అడ్డుకోవడంతో విపక్షాలపై సస్పెన్షన్ వేటు పడింది. వెల్లోకి దూసుకెళ్లిన 23మంది కాంగ్రెస్, వామపక్ష సభ్యులను డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సస్పెండ్ అయిన కాంగ్రెస్, వామపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభ మరోసారి మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది.