
సీఏఏ, ఎన్‌ఆర్‌సీ కష్టాలను అధిగమించేందుకు బ్యాంకు రుణాలు తీసుకోవాలని బాలీవుడ్ భామ సూచించారు.
ముంబై : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్‌ఆర్‌సీలపై అనవసరంగా ఆందోళన చెందవద్దని వీటికి తాను సరైన పరిష్కారంతో ముందుకొచ్చానని బాలీవుడ్ భామ రాఖీ సావంత్ చెప్పుకొచ్చారు. తన సలహా పాటిస్తే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ కష్టాలను ఇట్టే అధిగమించవచ్చన్నారు. తన సూచన దేశానికీ లాభదాయకమని ఆమె పేర్కొన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలతో చిన్నబుచ్చుకుని తమ తాతలు తమకు బర్త్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదని ఉసూరుమనేవారికి తన సలహా దివ్యౌషధంలా పనిచేస్తుందని మరీ రాఖీ చెబుతున్నారు. మీ బాధలను పోగొట్టేందుకు తానున్నానంటూ..మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్లకుండా ఉండాలని అనుకుంటే భారీ మొత్తంలో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని, బ్యాంకు అప్పుడు మీరు భారత పౌరులేనని నిరూపిస్తుందని ఇక మీరు దేని గురించీ బాధపడాల్సిన పనిలేదని ఉచిత సలహా ఇచ్చారు. ఇది చాలా సులభమని..ఇప్పుడే బ్యాంకుకు వెళ్లి రుణం తీసుకోండని ఆమె చెప్పుకొచ్చారు.