'సత్యం' శిక్షను సవాలుచేసిన రామలింగరాజు
సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలుచేస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక సీఈవో రామలింగరాజు సోమవారం నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం కోర్టుకు సమర్పించారు.
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి గత గురువారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.