
‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్‌తో రమణ్‌సింగ్ హ్యాట్రిక్
‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్‌తో రమణ్‌సింగ్ ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా మూడోసారి ఘన విజయాన్ని సాధించారు. విపక్షాల్లో సైతం రమణ్ సింగ్‌ను విమర్శించేవారు కొద్దిమంది మాత్రమే. ఆయుర్వేద వైద్యుడైన రమణ్ సింగ్ 1983లో రాజకీయాల్లో ప్రవేశించి కవర్ధా నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ విభజనకు ముందు 1990లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేశారు.
2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసే పరిస్థితి ఏర్పడలేదు. పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగినా ఇంతవరకు ఆయనపై రాజకీయంగా ఎలాంటి మరకలూ లేవు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని మొత్తం 90 నియోజకవర్గాల మీదుగా ఆరువేల కిలోమీటర్ల దూరం ‘వికాస్ యాత్ర’ సాగించి, ఓటర్లలో తనకున్న పట్టు నిరూపించుకున్నారు. తొలిసారిగా 2003లో అదృష్టం కలసిరావడం వల్లే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారని అంతా అనుకున్నారు. ప్రజలతో మమేకం కావడం ద్వారా ఆయన విమర్శకుల అంచనాలను పటాపంచలు చేసి, రెండోసారి కూడా అధికారంలోకి రాగలిగారు. రాష్ట్రంలో బీజేపీ ఘన విజయానికి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ మాత్రమే కారణమని మోడీ ప్రచారం ‘బోనస్’ మాత్రమేనని రమణ్ సింగ్ అనుచరులు చెబుతున్నారంటే, ఛత్తీస్‌గఢ్‌లో ఆయనకు గల ప్రజాదరణ ఎలాంటిదో అర్థమవుతుంది