
ఐటీ దాడి... పిజ్జా గోల!
సెంట్రల్ ముంబైలోని ఓ డాక్టర్ తన ఇంట్లో నుంచి దాదాపు 16 లక్షల రూపాయల విలువ చేసే నగలు పోయాయని, పనిమనిషి రామ్‌చౌదరిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎన్‌ఎం జోషి మార్గ్ పోలీసుస్టేషన్ సిబ్బంది రామ్‌చౌదరిని బిహార్‌లోని అతని స్వస్థలంలో అరెస్టు చేశారు. నగలకు రికవరీ చేసుకున్నారు. అయితే రామ్‌చౌదరి, అతని సహచరుడు అనిల్ కామత్‌లను విచారించగా... పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. బాలీవుడ్‌లో చాలామంది స్టార్లకు సన్నిహితుడైన ఈ డాక్టర్ ఇంటిపై రెండువారాల కిందట ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు.
తనిఖీలు కొనసాగుతుండగా... డాక్టర్ భార్యకు ఓ ఆలోచన తట్టింది. తమ కుటుంబసభ్యులతో పాటు ఐటీ అధికారులకు పిజ్జాలు ఆర్డర్ చేసి తెప్పించారు. వాటిని తిన్నాక... ఐటీ అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా ఖాళీ పిజ్జా బాక్సుల్లో నగలు నింపి... వాటిని బయటపడేసి, వాటిపై ఓ కన్నేసి అక్కడే ఉండమని పనిమనిషి రామ్ చౌదరికి ఆమె పురమాయించారు. నగలతో కూడిన పిజ్జా బాక్సులతో బయటికి వెళ్లిన రామ్ చౌదరి... వాటితో ఉడాయించాడు. అరెస్టయ్యాక అతను చెప్పిన విషయాలు విని పోలీసులు కంగుతిన్నారు. వెంటనే విషయాన్ని ఐటీ అధికారులకు చెప్పడం నోరు వెళ్లబెట్టడం వాళ్ల వంతు అయ్యిందట.