
హరిద్వార్/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వ్యాధిని మట్టుబెట్టే మందును కనుగొన్నట్లు యోగా గురువు రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద ఔషధ కంపెనీ ప్రకటించింది. ‘కరోనిల్, శ్వాసరి’అనే ఈ ఔషధాలు కోవిడ్‌ని ఏడు రోజుల్లో నయం చేస్తాయని కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ ఔషధం వివరాలను తమకు సమర్పించాలనీ, దీనిపై ఎటువంటి ప్రకటనలు చేయరాదని పతంజలి సంస్థను కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనిల్, శ్వాసరి అనే రెండు ఆయుర్వేద మందులూ వెంటిలేటర్‌పై ఉన్న వారు మినహా ఇతర కోవిడ్ పేషెంట్లపై ప్రయోగించినప్పుడు 100 శాతం ఫలితాలిచ్చాయని రామ్‌దేవ్ హెర్బల్ మెడిసిన్ కంపెనీ వెల్లడించింది. క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా (సీటీఆర్‌ఐ) అనుమతితో ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు రామ్‌దేవ్ వెల్లడించారు. అన్ని ప్రొటోకాల్స్‌ని అనుసరించి, నియంత్రిత వైద్యపరీక్షల ఆధారంగా, హరిద్వార్‌లోని పతంజలి రీసెర్చ్ సెంటర్, జైపూర్‌లోని ప్రైవేటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఈ ఔషధాన్ని అభివృద్ధి పరిచినట్టు తెలిపారు. పతంజలి యాంటీ కోవిడ్ టాబ్లెట్, దివ్య కరోనిల్ ట్యాబ్లెట్‌ను తులసి, అశ్వగంధ, తిప్పతీగలతో తయారుచేశారు. ఈ ఔషదాన్ని 15 నుంచి 80 ఏళ్ల వారు వాడవచ్చునని పతంజలి ఔషధ సంస్థ సూచించింది. కరోనిల్‌తోపాటు, శ్వాసరి, అను టెల్ మందులను వాడాల్సి ఉంటుంది. వచ్చే సోమవారం నుంచి మొబైల్ యాప్ ద్వారా ఈ మందుల కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చన్నారు. రూ.545 ఖరీదైన ఈ కరోనా కిట్‌లో 30 రోజులకు సరిపడా మందులు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment