లక్నో: విశ్వహిందూ మహాసభల నాయకుడు రంజిత్ బచ్చన్ ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన భార్య కలింది మాట్లాడుతూ.. రంజిత్‌కు రాడికల్ గ్రూప్‌ల నుంచి తరచూ బెదిరింపు కాల్స్, మెసెజ్‌లు వచ్చేవని పేర్కొన్నారు. అయితే ఆయనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో తనకు ఎప్పటికీ హాని జరగదని ఆయన చాలా నమ్మకంగా ఉండేవారన్నారు. కాగా గతంలో మేము మా బిడ్డను కోల్పోయాము, ఇప్పుడు నా భర్తను కోల్పోయానంటూ ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన భర్తను హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
(చదవండి: విశ్వహిందూ మహాసభ చీఫ్ కాల్చివేత..!)
ఇక రంజిత్ హత్య కేసుపై లక్నో పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టగా సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు క్రైం బ్రాంచ్ పోలీసుల బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ. 50 వేలు బహుమతిని ఇవ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. కాగా ఆదివారం ఉదయం హజ్రత్‌గంజ్ ప్రాంతంలో మార్నింగ్ వాక్ వెళ్లిన రంజిత్ బచ్చన్, అతని సోదరునిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో బచ్చన్ అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన సోదరుడు చికిత్స పొందుతున్నాడని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment