ఆసారాంకు జీవిత ఖైదు | For raping 16-year-old at ashram, Asaram gets life in jail till death | Sakshi
Sakshi News home page

ఆసారాంకు జీవిత ఖైదు

Published Thu, Apr 26 2018 2:41 AM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

For raping 16-year-old at ashram, Asaram gets life in jail till death - Sakshi

జోధ్‌పూర్‌: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో వివాదాస్పద స్వామీజీ ఆసారాం (77)కు జోధ్‌పూర్‌ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. దీంతోపాటుగా రూ. లక్ష జరిమానాను విధించింది. జోధ్‌పూర్‌ సెంట్రల్‌  జైల్‌లో ఏర్పాటుచేసిన తాత్కాలిక కోర్టులో న్యాయమూర్తి మధుసూదన్‌ శర్మ ఈ తీర్పు వెలువరించారు. ఆసారాంకు జీవిత ఖైదు, ఆయన అనుచరులు శరత్, శిల్పిలకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించి.. మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేశారు.

2013 నాటి ఈ కేసులో చార్జిషీటు దాఖలైనప్పటి నుంచి దాదాపు ఐదేళ్లుగా ఆసారాం జోధ్‌పూర్‌ జైల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. చనిపోయేంతవరకు ఆయన జైల్లో ఉండాల్సిందేనని తీర్పు వెలువడిన అనంతరం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోకర్‌ రామ్‌ బిష్ణోయ్‌ వెల్లడించారు. రాజస్తాన్‌ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కాగా, ఈ తీర్పుతో తమకు న్యాయం జరిగిందని  ఈ కేసు వేసిన బాలిక కుటుంబం పేర్కొంది. తీర్పు తర్వాత ఆసారాం ఉద్వేగానికి గురయ్యారు. కాగా, ఆసారాంకు బెయిల్‌ కోసం ఆయన న్యాయవాదులు గురువారం రాజస్తాన్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయనున్నారు.

ఆసారాం తీరు సిగ్గుచేటు
 బాలికతో ఆసారాం ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని.. తనపై భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని తీర్పు సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మధుసూదన్‌ శర్మ వ్యాఖ్యానించారు. ‘ఆసారాంకు దేశ విదేశాల్లో లక్షల మంది భక్తులున్నారు. ఆయన పేరుతో 400 ఆశ్రమాలున్నాయి. బాధితురాలి కుటుంబం ఆసారాంను విశ్వసించింది. షాజహాన్‌పూర్‌లో ఆశ్రమ నిర్మాణంలో బాధితురాలి తండ్రి కీలకంగా వ్యవహరించారు. అలాంటిది.. సిగ్గుచేటు చర్య ద్వారా తనపై భక్తులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆసారాం వమ్ముచేశారు.

జపం చేద్దామని తన గదికి పిలిచి లైంగిక వేధింపులకు దిగారు’ అంటూ 453 పేజీల తీర్పులో జడ్జి పేర్కొన్నారు. ‘దేవుడిగా తనను నమ్మిన బాలిక విశ్వాసానికి ఆసారాం ద్రోహం చేశారు. వదిలిపెట్టమని పదే విజ్ఞప్తి చేసినా కనికరించకుండా అత్యాచారం చేశారు. ఇలాంటి వ్యక్తిపై జాలి చూపించటం, బాధిత బాలికకు న్యాయం చేయకపోవటం మొత్తం వ్యవస్థకే చేటు. ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తుంది’ అని ఆయన తీర్పులో వెల్లడించారు. దేశంలో పేదలు కూడా న్యాయాన్ని అందుకోగలరని ఈ తీర్పు మరోసారి వెల్లడించిందని ఈ కేసు విచారణను పర్యవేక్షించిన ఐపీఎస్‌ అధికారి అజయ్‌పాల్‌ లాంబా అన్నారు. ‘చివరకు నిజమే గెలిచింది. భారత న్యాయచరిత్రలోనే ఇదో గొప్ప తీర్పుగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.  

భద్రత కట్టుదిట్టం
డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ కేసు తీర్పు సమయంలో తలెత్తిన విధ్వంసం నేపథ్యంలో.. ఆసారాం ఆశ్రమంతోపాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జోధ్‌పూర్‌ కోర్టు, సెంట్రల్‌ జైలు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకొచ్చారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాజస్తాన్‌తోపాటు, ఆసారాం భక్తులు భారీగా ఉన్న గుజరాత్, హరియాణా, మధ్యప్రదేశ్‌లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని రాజస్తాన్‌ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

న్యాయం జరిగింది: బాలిక తండ్రి
ఆసారాం బాపుకు శిక్ష పడటంపై.. బాధిత బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురికి సరైన న్యాయం జరిగిందని బాలిక తండ్రి ఉద్వేగంగా పేర్కొన్నారు. ‘కోర్టు ఇచ్చిన తీర్పుతో సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వం, కోర్టులు మాతోనే ఉన్నాయన్న నమ్మకం కుదిరింది. మేం భయపడాల్సిన పనిలేదు. నేను చనిపోయినా బాధలేదు. నా కూతురికి న్యాయం జరిగింది’ అని నాటి మైనర్‌ బాలిక తండ్రి పేర్కొన్నారు. ‘నా కూతురు ధైర్యవంతురాలు. ఆమె ధైర్యం కారణంగానే తప్పుడు పనులుచేస్తున్న ఈ దొంగబాబాకు శిక్షపడేలా చేయగలిగాం. నాలుగేళ్లుగా మా కుటుంబం ఇంటినుంచి బయటకు రాలేదు. మా బంధువులను బెదిరించారు.  ఆసారాం ఇక జైలు నుంచి బయటకు రారు. ఈ పోటీలో మేమే గెలిచాం’ అని ఆయనన్నారు.

సర్వత్రా హర్షం
జోధ్‌పూర్‌ తీర్పును రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు స్వాగతించారు. ‘గురువంటే అందరినీ కాపాడాలి. కానీ వారిపై లైంగిక దాడులకు పాల్పడటం కాదు. ఉన్నత స్థానంలో ఉండి నమ్మిన వారిపైనే నేరాలకు పాల్పడిన ఆసారాంకు ఇది సరైన శిక్ష. బాలలపై నేరాలను తగ్గించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ పురోగమన చర్యే అవుతుంది’ అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ స్తుతి కేకర్‌ పేర్కొన్నారు. ‘ఇలాంటి బాధితులందరి విజయమిది.

ఆసారాంలాగా క్రూరమైన లైంగిక నేరాలకు పాల్పడే వారంతా.. చట్టం నుంచి తప్పించుకోలేరనే సందేశాన్నిచ్చిన తీర్పు ఇది. బాధితురాలు, ఆమె తండ్రి ధైర్యాన్ని ప్రశంసించకుండా ఉండలేం’ అని బాధితురాలి తరపు న్యాయవాది ఉత్సవ్‌ బైన్స్‌ పేర్కొన్నారు. ఆసారాం సాధు వేశంలో ఉన్న రాక్షసుడని.. జోధ్‌పూర్‌ కోర్టు ద్వారా బాధితురాలికి సరైన న్యాయం జరిగిందని నిర్భయ (ఢిల్లీ హత్యాచార ఘటన బాధితురాలు) తాత తెలిపారు.


రేపిస్టు అనొద్దు: వంజారా
ఆసారాం చేసింది తప్పే అయినా ఆయన్ను రేపిస్టు అనటం సరికాదని.. గుజరాత్‌ మాజీ పోలీసు ఉన్నతాధికారి వంజారా అభిప్రాయపడ్డారు. బాధితురాలు తన ఎఫ్‌ఐఆర్‌లోనూ ఆసారాం తనపై అత్యాచారం చేసినట్లు పేర్కొనలేదని.. అసభ్యంగా ప్రవర్తించాడని మాత్రమే పేర్కొందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మెడికల్‌ పరీక్షల్లోనూ ఈ విషయం వెల్లడైందని వంజారా గుర్తుచేశారు. రేప్‌ చేయకపోయినా.. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించటమూ నేరమేనన్నారు.

అసలు కేసేంటి?
ఆగస్టు 15, 2013 నాటి 16 ఏళ్ల అమ్మాయిపై రేప్‌ కేసులో సెప్టెంబర్‌ 1న ఇండోర్‌లో ఆసారాంను పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8, భారతీయ శిక్షాస్మృతిలోని 342, 376, 354(ఏ), 506, 509/34, జువెనైల్‌ జస్టిస్‌ చట్టంలోని సెక్షన్లు 23,26 కింద కేసు నమోదు చేశారు. కేసు మొదట జోధ్‌పూర్‌ జిల్లా కోర్టులో విచారించినప్పటికీ.. ఆ తర్వాత 2016, డిసెంబర్‌16న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు మార్చారు. ఈ మధ్యలో ఆయన 12సార్లు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కోర్టులు తిరస్కరించాయి.

ఏప్రిల్‌ 7నే వాదనలు పూర్తవగా.. న్యాయస్థానం తుది తీర్పును ఏప్రిల్‌ 25కు రిజర్వ్‌ చేసింది. 1997 నుంచి 2006 మధ్య అహ్మదాబాద్, సూరత్‌ ఆశ్రమాల్లో చదువుకున్న సమయంలో ఆసారాంతోపాటు ఆయన కుమారుడు నారాయణ్‌ సాయి తమపై అత్యాచారానికి పాల్పడ్డారని సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఫిర్యాదు చేశారు.  బెయిల్‌ ఇవ్వాలంటూ న్యాయమూర్తులను, విచారణకు వచ్చిన పోలీసులను కూడా బెదిరించడంతో ఆసారాంకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టులు నిరాకరించాయి.

గుడిసె నుంచి రూ.10,000 కోట్లకు..
అహ్మదాబాద్‌: జోధ్‌పూర్‌ కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన ఆసారాం బాపు ప్రయాణం సబర్మతి నదీ తీరాన ఓ చిన్న గుడిసె నుంచి ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 400 ఆశ్రమాలు, రెండు కోట్ల మంది అనుచరులు ఉన్న ఆసారాం సంపద కూడా రూ.10,000 కోట్లకు పైమాటే. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సింధ్‌ ప్రావిన్సులోని బెరానీ గ్రామంలో 1941, ఏప్రిల్‌ 17న ఆసారాం జన్మించాడు. అసలు పేరు అసుమల్‌ తౌమల్‌ హర్‌పలాని. 1947లో దేశ విభజన తర్వాత ఆసారాం కుటుంబం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వలసవచ్చింది.

అక్కడే ఓ పాఠశాలలో ఆయన నాలుగో తరగతి వరకూ చదువుకున్నాడు. కొద్దికాలానికే తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం గుర్రపు బగ్గీలు నడపటం, సైకిళ్లు రిపేర్‌ చేయడంతో పాటు టీ, మద్యం అమ్మడం వంటి పనులు చేశాడు.  చివరికి పెళ్లికి 8 రోజుల ముందు 15 ఏళ్ల ప్రాయంలో ఇల్లు వదిలి పారిపోయాడు. బెహరూచ్‌లోని ఆధ్యాత్మిక గురువు లీలాషా బాపు వద్ద శిష్యుడిగా చేరాడు. లీలాషా బాపునే ఆయన పేరును ఆసారాంగా మార్చారు. అనంతరం గుజరాత్‌లోని మొతెరాలో సబర్మతి నదీతీరాన ‘మోక్ష కుటీర్‌’ పేరుతో చిన్న గుడిసెలో ఆశ్రమాన్ని ఆసారాం ప్రారంభించాడు.

కాలక్రమేణా ఆశ్రమాల కోసం ఆసారాంకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విరివిగా భూములిచ్చాయి. అయితే ఆసారాం తమ భూమిని కబ్జా చేశారని పలువురు ప్రజలు కోర్టుల్ని ఆశ్రయించారు. కేవలం ఆశ్రమాలే కాకుండా ఆయుర్వేద మందులు, ఆధ్యాత్మిక పుస్తకాల అమ్మకాలతో ఆసారాం భారీగా ఆదాయాన్ని గడించాడు. ఆసారాంకు భార్య లక్ష్మీ దేవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు నారాయణ సాయి ఓ రేప్‌ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. గుజరాత్‌లోని మొతెరా ఆశ్రమం సమీపంలో 2008లో దీపేశ్, అభిషేక్‌ అనే  పిల్లలు విగతజీవులై కన్పించడంతో ఆసారాంకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

వీరిద్దరినీ బలిచ్చారని వారి కుటుంబసభ్యులు ఆరోపించడంతో సీఐడీ పోలీసులు ఏడుగురు ఆసారాం అనుచరుల్ని అరెస్ట్‌ చేశారు. 2013లో ఓ మైనర్‌ బాలిక తనపై ఆసారాం అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడంతో ఆయన ప్రతిష్ట మసకబారింది. ఈ ఘటన జరిగిన వెనువెంటనే సూరత్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు తమపై కూడా ఆసారాం, ఆయన కుమారుడు సాయి అత్యాచారం చేశారని బయటికొచ్చారు. తర్వాత ఆశ్రమాలపై దాడిచేసిన పోలీసులకు వేలాది ఎకరాల భూముల డాక్యుమెంట్లు, భారీ సంఖ్యలో షేర్ల పత్రాలు లభ్యమయ్యాయి.

                                           అహ్మదాబాద్‌లోని ఆసారాం ఆశ్రమం 

ఆసారాంతో మోదీ
ఆసారాం దోషిగా తేలడంతో ప్రధాని మోదీ గతంలో ఆసారాంతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలను పలువురు నెటిజన్లతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘నీ స్నేహితులను బట్టి నీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు’ అనే అర్థం వచ్చేలా ఉన్న క్యాప్షన్‌ను ఓ ఫొటోకు కాంగ్రెస్‌ పెట్టింది. ఆ తర్వాత స్త్రీలపై గతంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అనేకమంది బీజేపీ నేతల పేర్లతో ఓ జాబితాను కూడా కాంగ్రెస్‌ పోస్ట్‌ చేసింది. కొందరు మరో ఫొటోతో కాంగ్రెస్‌కు కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ నేత దిగ్విజయ సింగ్‌ గతంలో మధ్యప్రదేశ్‌ సీఎంగా ఉండగా ఆసారాంకు దండం పెడుతున్న ఫొటోలను పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement