ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. చిత్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్షణ్, మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రతి పౌరుడు, అన్ని వర్గాల ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మన దేశం అభివృద్ధిలో మరింతగా పురోగమించేందుకు ‘భారత్ కే మన్ కీ భాత్.. మోదీకే సాథ్’పేరిట దేశ పౌరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. వాటన్నింటిని క్రోడీకరించి మేనిఫెస్టోలో పొందుపరుస్తామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పలు సాఫ్ట్‌వేర్ కంపెనీల ప్రతినిధులు, ఐటీ నిపుణులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి అవసరమైన అభిప్రాయ సేకరణ కోసం దేశవ్యాప్తంగా 7 వేల డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలు తమ అభిప్రాయాలు రాసి వాటిల్లో వేయాలని, అనంతరం వాటిని తీసుకొని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు 300 ఐటీ బృందాలను నియమించినట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. మిస్డ్ కాల్ ద్వారా కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం 6357171717 నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
యూపీఏ 11.. ఎన్డీయే 6..
యూపీఏ హయాంలో ప్రపంచ ఆర్థిక రంగంలో దేశం 11వ స్థానంలో ఉంటే మోదీ ప్రభుత్వం ఆరో స్థానానికి చేరుకుందన్నారు. 30 కోట్ల మందికి పింఛన్లు, 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా రూ.6 వేల సాయం వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 మే 26 వరకు దేశంలో 6.2 కోట్ల గ్రామీణ ప్రాంత టాయిలెట్లు నిర్మిస్తే మోదీ హయాంలో 10 కోట్ల టాయిలెట్స్ నిర్మించామన్నారు. దేశ రక్షణ, నల్లధనం విషయంలో మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు అడ్డగోలుగా బ్యాంకుల ద్వారా రుణాల పేరిట దోచిపెట్టాయని, తమ ప్రభు త్వం బకాయిలను రాబట్టే పనిలో పడిందని వెల్లడించారు. మాల్యాకు చెందిన రూ.13 వేల కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపారు. 2019లో ఎన్డీయే 300 స్థానాలను సాధించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. రఫేల్ విషయంలో మోదీ పట్ల రాహుల్ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
రఫేల్‌పై కమీషన్లు రావనే..
2001లో రఫేల్ ఒప్పందం చేసుకున్నా కమీషన్లు రావనే ఉద్దేశంతో కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. యూపీఏ కంటే 9 శాతం తక్కువ ధరకు విమానాలను, వెపన్స్ లోడింగ్‌లో 20 శాతం తక్కువ ధరలకే కొనుగోలు చేసిందన్నారు. సుప్రీం కోర్టు కూడా రఫేల్ కొనుగోలులో ఎలాంటి లొసుగులు లేవని చెప్పిందన్నారు. ఎకనమిక్ టైమ్స్ కూడా రఫేల్ సీఈవో ఎరిక్‌ను ఇంటర్వూ్య చేసిందని, అందులో యూపీఏ కంటే మోదీ ప్రభుత్వం 9 శాతం తక్కువ ధరకు కొనుగోలు చేసిందని చెప్పారు.
చంద్రబాబు నైజం అదే..
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పేరుతో మోదీకి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్నాపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘చంద్రబాబు వైఖరి కొత్తేమీ కాదు. పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లి గెలవడం. తర్వాత వారిపైనే విమర్శలు చేయడం చంద్రబాబు నైజం. వాజ్‌పేయితోనూ చంద్రబాబు ఇలాగే వ్యవహరించారు. కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన అనంతరం చంద్రబాబు వాజ్‌పేయిని ఆశ్రయించి పొత్తు పెట్టుకుని అప్పటి ఎన్నికల్లో గెలిచారు. 2014లో మోదీకి దేశంలో ప్రజాదరణ పెరగ్గానే ఆయన పంచన చేరి ఆనాడు ఎన్నికల్లో గెలిచారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడేమో మోదీపై విమర్శలు చేస్తున్నారు’అని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment