18 వరకు రోజుకు 2 వేల రూపాయలే
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఏటీఎంలు పనిచేయడం ప్రారంభమైన నేపథ్యంలో డబ్బులు డ్రా చేయడంపై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరోసారి వివరణ ఇచ్చింది. రూ. 500, 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2000 రూపాయల నోట్లతో పాటు ఇతర డినామినేషన్ కలిగిన నోట్లను విస్తృతంగా పంపిణీ చేశామని ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఒక్కో కార్డుపైన రోజుకు 2 వేలకు మించి విత్ డ్రా చేయడానికి వీలులేదని, ఈ నెల 18 వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుందని ఆర్బీఐ శుక్రవారం మరోసారి పేర్కొంది.
ఈ నెల 18 వ తేదీ తర్వాత ప్రతి కార్డుపైనా రోజుకు 4 వేల వరకు డ్రా చేయొచ్చని తెలిపింది. ఇకపోతే రద్దు చేసిన రూ. 500, 1000 నోట్లను డిసెంబర్ 30 వ తేదీ వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చని, ఈ విషయంలో ప్రజలు కొంత ఓపిక, సహనం పాటించాలని కోరింది. ఇకపోతే, ఖాతాదారులు బ్యాంకుల్లోని కౌంటర్ల వద్ద డబ్బు విత్ డ్రా చేసుకునే వారికి 10 వేల రూపాయలకు మించి తీసుకోవడానికి వీలులేదు. ఆ వారంలో మొత్తంగా విత్ డ్రా 20 వేలకు మించకుండా చూసుకోవాలి. నవంబర్ 24 వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుందని, ఆ తర్వాత ఈ అంశంపై మరోసారి సమీక్షించిన తర్వాత పరిమితి పెంచాలా వద్దా అన్న నిర్ణయం జరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది.