న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోల్చిచూస్తే భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రతి లక్ష జనాభాకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే ప్రపంచంలోనే భారత్ చిట్టచివరి స్థానంలో ఉంటుందని సోమవారం తెలియజేసింది. ఇండియాలో జనసాంద్రత అత్యధికంగా ఉన్నప్పటికీ కరోనా రికవరీ రేటు దాదాపు 56 శాతానికి పెరగడం సానుకూల పరిణామమని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) జూన్ 21న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రతి లక్ష జనాభాకు ప్రపంచవ్యాప్తంగా సగటున 114.67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, భారత్‌లో ఆ సంఖ్య కేవలం 30.04. అంటే భారత్‌లో కంటే మూడు రెట్లు అధికంగా కేసులు నమోదైనట్లు స్పష్టమవుతోంది.
ఒక్కరోజులో 14,821 కేసులు
పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి మరో 445 మందిని బలితీసుకుంది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఒక్కరోజులో కొత్తగా 14,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 4,25,282కు, మరణాల సంఖ్య 13,699కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత జూన్ 1 నుంచి 22వ తేదీ వరకు ఏకంగా 2,34,747 పాజిటివ్ కేసులు బహిర్గతం కావడం గమనార్హం.
ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1,74,387 కాగా.. ఇప్పటిదాకా 2,37,195 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. గత 24 గంటల్లో 9,440 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 55.77 శాతానికి చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 21వ తేదీ నాటికి దేశంలో 69,50,493 కరోనా టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. కరోనా ప్రభావిత దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కరోనా సంబంధిత మరణాల విషయంలో ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
జూలైలో గరిష్టం.. తర్వాత తగ్గుదల
ముంబై: భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య ఇప్పటికే 4.25 లక్షలు దాటేసింది. మరణాలు 14 వేలకు చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్ నెట్‌వర్క్ అంచనాల్లో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. దీనిప్రకారం.. దేశంలో చాలా నగరాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు జూలై నెలలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. సెప్టెంబర్‌లో కరోనా వైరస్ దాదాపుగా అంతరించిపోతుంది. అంటే కేసులు అత్యల్పంగా నమోదవుతాయి.
దేశంలో కరోనా పరిస్థితిపై ఈ సంస్థ తాజాగా ‘టైమ్స్ ఫ్యాక్ట్–ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్టు’ పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే బులెటిన్లు, కేంద్ర ఆరోగ్యశాఖ శాఖ విడుదల చేస్తున్న సమాచారంతో కొన్ని గణిత సిద్ధాంతాల ఆధారంగా దేశంలో కరోనా వ్యాప్తిని అంచనా వేసింది. కరోనా కేసుల విషయంలో టైమ్స్ గ్రూప్ అంచనాలు 96 శాతం నిజమవుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం.. భారత్‌లో జూలై 15వ తేదీ నాటికి కరోనా యాక్టివ్ కేసులు 2,59,967కు, జూలై 25 నాటికి గరిష్ట స్థాయిలో 3,86,916కు చేరుకుంటాయి. దేశంలో సెప్టెంబర్ 19వ తేదీ నాటికి కరోనా దాదాపుగా అంతమైపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment