World Health Organization report
-
హెల్త్‌కేర్ అక్రమాలపై ‘ఏఐ’ మంత్రం!
భారత్‌లో హెల్త్‌కేర్ (ఆరోగ్య సంరక్షణ)లో ఏటా జరుగుతున్న అవకతవకలు కనిష్టంగా రూ.800 కోట్లు. ఇది కేవలం బీమా కంపెనీలు, ట్రస్టులు, హైబ్రీడ్ విధానంలో ఆరోగ్య సేవలందిస్తున్న కంపెనీల్లో జరిగేది మాత్రమే. ఇక వ్యక్తిగతంగా సర్విసులు పొందుతున్న వ్యక్తులకు సంబంధించిన కేటగిరీలో జరిగే అక్రమాలు ఇంతకు ఎన్నో రెట్లు ఉంటాయి. –ఆరోగ్య సంరక్షణలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అమలు నివేదికలో డబ్ల్యూహెచ్ఓ సాక్షి, హైదరాబాద్: అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే హెల్త్‌కేర్ కేటగిరీలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) పద్ధతుల వినియోగం ద్వారా చెక్ పెట్టొచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. సాధారణంగా ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసెస్‌లో ఎక్కువగా అవకతవకలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యాక అందించే చికిత్స, శస్త్రచికిత్సలో వివిధ రకాల పరికరాలు, మందులను వినియోగిస్తారు. ఈ ఖర్చంతా రోగి ఖాతాలో జమచేసి బిల్లులు వసూలు వేస్తారు. ఈ క్రమంలో అక్రమాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని పలు సర్వేలు చెబుతున్నాయి. రోగి డిశ్చార్జ్ సమయంలో బిల్లును పూర్తిస్థాయిలో పరిశీలించే పరిస్థితి లేకుండా మొత్తం బిల్లు వసూలు చేస్తారు. అయితే బీమా కంపెనీలు, ట్రస్టుల ద్వారా అమలయ్యే హెల్త్ కేర్ కార్యక్రమాల్లో ఈ బిల్లును కూలంకశంగా పరిశీలించి అవసరమైన మేరకు బిల్లును కుదించడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో అనవసర మందులు, వినియోగాన్ని గుర్తించి బిల్లు నుంచి తొలగించే సందర్భాలను ప్రస్తావిస్తూ డబ్ల్యూహెచ్ఓ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఈ అవకతవక లకు చెక్ పెట్టేందుకు ఏఐ, ఎంఎల్‌ను అందుబాటులోకి తీసుకొస్తే పారదర్శకత పెరుగుతుందని తెలిపింది. తెలంగాణ విధానం భేష్ ఏఐ, ఎంఎల్ వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం ముందువరుసలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రస్తావించింది. ‘రాష్ట్రంలో అమలు చేస్తున్న సామాజిక భద్రత పింఛన్లు, లబి్ధదారుల గుర్తింపు ప్ర క్రియలో ఏఐ, ఎంఎల్‌ను విస్తృతంగా వినియోగిస్తోంది. పెన్షన్ల పథకంలో ఏఐ విధానంలో భాగంగా బయోమెట్రిక్ ద్వారా లబి్ధదారు లైవ్ సర్టిఫికెట్లు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా పలు పథకాల్లో ఆన్లైన్ పద్ధతిలో వెరిఫికేషన్ చేయడం ద్వారా పారదర్శకంగా ఎంపికప్రక్రియను నిర్వహిస్తోంది. ఇక్కడ 96 శాతం సక్సెస్ రేట్ ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకంలో కొంతవరకు ఏఐని తెచ్చారు. ఆరోగ్యశ్రీలో ఫొటో తీసుకుని డిశ్చార్జ్ చేస్తున్నారు. అయితే సర్జరీకి ముందే లబ్ధిదారు నిర్ధారణ చేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ‘ఆయుష్మాన్’లో ప్రైవేటు ఆస్పత్రులు చేరట్లేదు ఆయుష్మాన్ భారత్ పథకానికి కేటాయించిన నిధుల్లో 60 శాతం మాత్రమే ఖర్చవుతోందని పార్లమెంటరీ స్ధాయీ సంఘం ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అలాగే, దేశంలోని 30 శాతం మందికి ఏ రకమైన ఆరోగ్య సంరక్షణ లేదని తెలిపింది. ఈ పథకం అమల్లోకి వచ్చి ఐదేళ్లయినా సగానికిపైగా ప్రైవేటు ఆసుపత్రులు ఈ పథకంలో చేరలేదు. కృత్రిమ మేథను సమర్థవంతంగా వినియోగిస్తే ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసి సాధ్యమైనంత ఎక్కువ మందికి సేవలు అందించే అవకాశం ఉంటుంది. –డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వినర్ -
తెలంగాణ: అర్హతలేని వైద్యులు 19.08 శాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యులుగా అవతారం ఎత్తిన అనర్హుల సంఖ్య గణనీయంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అర్హతలేని వైద్యులు తెలంగాణలో ఐదోవంతు మంది ఉన్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టం చేసింది. ఆ సంస్థ ‘హెల్త్ వర్క్‌ఫోర్స్ ఇన్ ఇండియా’పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో 19.08 శాతం మంది గుర్తింపుపొందిన సంస్థ నుంచి ఎలాంటి వైద్యపట్టా పొందకుండా డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని స్పష్టం చేసింది. ఇది జాతీయసగటు 17.93 శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక 58.24 శాతం మంది అర్హత లేకుండానే నర్సులుగా చెలామణి అవుతున్నారని పేర్కొంది. 10 వేల జనాభాకు 7.3 మంది డాక్టర్లు... దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లలో 3.52 శాతం మంది తెలంగాణలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి 10 వేల మంది జనాభాకు 7.3 మంది డాక్టర్లు, 13.8 మంది నర్సులున్నారు. సంప్రదాయ వైద్యంలో 10 వేల మంది జనాభాకు 3.4 శాతం మంది డాక్టర్లున్నారు. ఒక డాక్టర్‌కు ఇద్దరు నర్సులు, ఒక ఏఎన్ఎం ఉండాలి. అయితే ఈ లెక్క తెలంగాణలో సరిపోయింది. రాష్ట్రంలోని డాక్టర్లలో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది స్త్రీలు ఉన్నారు. నర్సుల్లో 83 శాతం మంది మహిళలు ఉన్నారు. కాగా, దేశవ్యాప్తంగా వైద్యపట్టా ఉన్నవారిలో 67 శాతం మంది ప్రాక్టీస్ చేస్తుండగా ఏడు శాతం మంది వైద్య నిరుద్యోగులుగా ఉన్నారు. మరో 27 శాతం మంది అవకాశం ఉండి కూడా ఖాళీగా ఉంటున్నారు. నివేదికలో తెలంగాణ ముఖ్యాంశాలు ►27,600 మంది అల్లోపతి డాక్టర్లు, 52,500 మంది నర్సులు ఉన్నారు. ►ఆయుష్ డాక్టర్లు 12,800 మంది, డెంటల్ డాక్టర్లు 6,700 మంది ఉన్నారు. అనుబంధ రంగాల ఆరోగ్య కార్యకర్తలు 54,900, ఫార్మసిస్టులు 12,100 మంది ఉన్నారు. ►30–40 ఏళ్ల మధ్య వయస్సు డాక్టర్లు 73 శాతం, 41–50 ఏళ్లవారు 18.53 శాతం, 51–65 ఏళ్ల/వారు 8.2 శాతం మంది ఉన్నారు. ►నర్సుల్లో 15–29 మధ్య వయస్సువారు 25.49 శాతం, 30–40 ఏళ్ల వయస్సువారు 31.5 శాతం, 41–50 ఏళ్ల వయస్సువారు 43 శాతం మంది ఉన్నారు. ఊ డాక్టర్లు 35 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో, 65 శాతం మంది పట్టణాల్లో ఉంటున్నారు. నర్సులు 42 శాతం పల్లె ప్రాంతాల్లో, 58 శాతం పట్టణాల్లో ఉంటున్నారు. ►86 శాతం మంది డాక్టర్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేదా సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 14 శాతం మంది కేవలం ప్రభుత్వ సర్వీసుల్లోనే పనిచేస్తున్నారు. నర్సుల్లో దాదాపు సమాన సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ►సబ్ సెంటర్లలో 2,324 ఏఎన్ఎం, పీహెచ్‌సీల్లో 187 వైద్య సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లో 41 అల్లోపతి డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ పోస్టులు 151, నర్సుల పోస్టులు 164 ఖాళీగా ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 296 నర్సులు, 122 ఎంబీబీఎస్ డాక్టర్లు, 367 స్పెషలిస్ట్‌ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఆయుష్ డాక్టర్ల పోస్టులు 27 ఖాళీగా ఉన్నాయి. ►పదివేల జనాభాకు ఉన్న డాక్టర్ల సంఖ్యలో తెలం గాణ దేశవ్యాప్తంగా ఏడో స్థానాన్ని ఆక్రమిం చింది. నర్సుల్లో 10వ స్థానంలో నిలిచింది. ►అల్లోపతి డాక్టర్లు, నర్సుల సంఖ్య విషయమై దేశంలో రాష్ట్రం 11, డెంటల్ డాక్టర్ల సంఖ్యలో 7, ఫార్మసిస్టుల్లో 8 స్థానాల్లో ఉంది. అర్హతలేనివారు డాక్టర్లుగా చలామణి ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో దాదాపు ఐదోవంతు మంది అర్హతలేనివారే వైద్యులుగా చలామణి అవుతుండటం విస్మయం కలిగించే అంశం. ప్రైవేట్ ప్రాక్టీషనర్లుగా చలామణి అయ్యేవారు కూడా వీరిలో ఉన్నారు. వైద్య, డెంటల్, ఆయుష్, నర్సు కోర్సులు వంటివేవీ చదవకుండా ఆయా రంగాల్లో చలామణి కావడాన్ని నివేదిక బట్టబయలు చేసింది. – డా.కిరణ్ మాదల, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
60 ఏళ్లు దాటితే విధిగా సర్జికల్ మాస్క్
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి కారణంగా ఎవరు ఎలాంటి మాస్కులు వాడాలో ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇప్పటివరకూ ఏ వయసు వారు ఎలాంటి మాస్కులు వాడాలన్న ప్రత్యేక నిబంధనలేవీ లేవు. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు ఇవీ.. ► 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళితే తప్పనిసరిగా మాస్కు ధరించాలి. ► 60 ఏళ్లు పైబడిన వారు విధిగా సర్జికల్ మాస్కు వాడాలి. ► ఐదేళ్ల లోపు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ► 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణలో మాస్కులు ధరించవచ్చు. హైరిస్క్ ప్రాంతాలను బట్టి ఆ మాస్కులు ధరించాల్సి ఉంటుంది. ► 12 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఫ్యాబ్రిక్ మాస్కు (3 పొరల వస్త్రంతో)ను వాడవచ్చు. -
భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువే
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోల్చిచూస్తే భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రతి లక్ష జనాభాకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే ప్రపంచంలోనే భారత్ చిట్టచివరి స్థానంలో ఉంటుందని సోమవారం తెలియజేసింది. ఇండియాలో జనసాంద్రత అత్యధికంగా ఉన్నప్పటికీ కరోనా రికవరీ రేటు దాదాపు 56 శాతానికి పెరగడం సానుకూల పరిణామమని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) జూన్ 21న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రతి లక్ష జనాభాకు ప్రపంచవ్యాప్తంగా సగటున 114.67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, భారత్‌లో ఆ సంఖ్య కేవలం 30.04. అంటే భారత్‌లో కంటే మూడు రెట్లు అధికంగా కేసులు నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఒక్కరోజులో 14,821 కేసులు పెరిగిన రికవరీ రేటు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి మరో 445 మందిని బలితీసుకుంది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఒక్కరోజులో కొత్తగా 14,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 4,25,282కు, మరణాల సంఖ్య 13,699కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. లాక్డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత జూన్ 1 నుంచి 22వ తేదీ వరకు ఏకంగా 2,34,747 పాజిటివ్ కేసులు బహిర్గతం కావడం గమనార్హం. ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 1,74,387 కాగా.. ఇప్పటిదాకా 2,37,195 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. గత 24 గంటల్లో 9,440 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 55.77 శాతానికి చేరిందని అధికార వర్గాలు తెలిపాయి. జూన్ 21వ తేదీ నాటికి దేశంలో 69,50,493 కరోనా టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. కరోనా ప్రభావిత దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కరోనా సంబంధిత మరణాల విషయంలో ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. జూలైలో గరిష్టం.. తర్వాత తగ్గుదల ముంబై: భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య ఇప్పటికే 4.25 లక్షలు దాటేసింది. మరణాలు 14 వేలకు చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్ నెట్వర్క్ అంచనాల్లో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. దీనిప్రకారం.. దేశంలో చాలా నగరాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు జూలై నెలలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. సెప్టెంబర్‌లో కరోనా వైరస్ దాదాపుగా అంతరించిపోతుంది. అంటే కేసులు అత్యల్పంగా నమోదవుతాయి. దేశంలో కరోనా పరిస్థితిపై ఈ సంస్థ తాజాగా ‘టైమ్స్ ఫ్యాక్ట్–ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్టు’ పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే బులెటిన్లు, కేంద్ర ఆరోగ్యశాఖ శాఖ విడుదల చేస్తున్న సమాచారంతో కొన్ని గణిత సిద్ధాంతాల ఆధారంగా దేశంలో కరోనా వ్యాప్తిని అంచనా వేసింది. కరోనా కేసుల విషయంలో టైమ్స్ గ్రూప్ అంచనాలు 96 శాతం నిజమవుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం.. భారత్‌లో జూలై 15వ తేదీ నాటికి కరోనా యాక్టివ్ కేసులు 2,59,967కు, జూలై 25 నాటికి గరిష్ట స్థాయిలో 3,86,916కు చేరుకుంటాయి. దేశంలో సెప్టెంబర్ 19వ తేదీ నాటికి కరోనా దాదాపుగా అంతమైపోతుంది. -
11 సెకన్లకో ప్రాణం బలి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో అంతరాలు పెరుగుతున్నాయా? కొన్నిదేశాల్లో గర్భిణులు, నవజాతశిశు మరణాలు గణనీయంగా తగ్గుతుంటే, మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందా? అంటే ఐక్యరాజ్యసమితి(ఐరాస) అవుననే జవాబిస్తోంది. సరైన వైద్య సౌకర్యాలు, పరిశుభ్రతలేమి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 సెకన్లకు ఓ గర్భిణి–బాలింత లేదా నవజాతశిశువు చనిపోతున్నారని ఐరాస తెలిపింది. అందుబాటులో మెరుగైన వైద్యం, మందులు, పరిశుభ్రత, పోషకాహారంతో ఈ మరణాలను నివారించవచ్చని వెల్లడించింది. అధికాదాయం ఉన్న ధనికదేశాల్లో స్త్రీ, శిశు మరణాలు తగ్గుతుంటే, ఆఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఐరాస అనుబంధ సంస్థలు సమర్పించిన నివేదికల్లోని వివరాలను ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోలేమని హెచ్చరించారు. ► గతేడాదితో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు సగానికి తగ్గిపోయి 53 లక్షలకు చేరాయి. ► ప్రసవ సమయంలో సమస్యలతో చనిపోయే గర్భిణుల సంఖ్య మూడోవంతు తగ్గింది. ఈ సంఖ్య 2000లో 4,51,000 ఉండగా, 2017 నాటికి 2,95,000కు పడిపోయింది. ► ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 28 లక్షల మంది మహిళలు, నవజాతశిశువులు చనిపోతున్నారు. ► పరిశుభ్రమైన నీరు, పోషకాహారం, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఈ మరణాలన్నీ నివారించవచ్చు. ► ప్రతీ 11 సెకన్లకు ప్రపంచవ్యాప్తంగా ఓ బాలింత లేదా గర్భిణి లేదా నవజాతశిశువు ప్రాణాలు కోల్పోతున్నారు. ► ధనిక దేశాలతో పోల్చితే ఆఫ్రికా దేశాల్లో గర్భిణులు/బాలింతల మరణాలు 50 రెట్లు ఎక్కువ. ► ఆఫ్రికా దేశాల్లోని చిన్నారులు అధికాదాయం ఉన్న దేశాల చిన్నారుల కంటే చనిపోయే అవకాశాలు 10 రెట్లు అధికం. ► 2018లో ఆఫ్రికాలో ప్రతీ 13 మంది చిన్నారుల్లో ఒకరు పుట్టిన ఐదేళ్లలోపే చనిపోయారు. యూరప్‌లో ఈ సంఖ్య ప్రతి 196 మందిలో ఒక్కరే. ► ఆఫ్రికాలో ప్రసవ సమయంలో ప్రతి 37 మంది గర్భిణుల్లో ఒకరు మరణిస్తున్నారు. యూరప్‌లో ప్రతి 6,500 మంది మహిళలకు గానూ ఒకరు మాత్రమే ప్రసవ సమయంలో కన్నుమూస్తున్నారు. ► అమెరికాలోలో ప్రసవ మరణాలు 58 శాతం పెరిగాయి. అమెరికాలో 2017లో ప్రతి లక్ష ప్రసవాల సందర్భంగా 19 మంది చనిపోయారు. -
కాలుష్యానికి 6 లక్షల చిన్నారుల బలి
జెనీవా: ఇంటాబయటా పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆరోగ్యం–వాయు కాలుష్యం ప్రభావం’పై త్వరలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో రూపొందించిన ఈ నివేదికను డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టీఏ ఘెబ్రెయ్‌సస్ వెల్లడించారు. ఆ వివరాలు. నిత్యం 15 ఏళ్లలోపు పిల్లలలో 93 శాతం మంది 180 కోట్ల మంది, వీరిలో 63 కోట్ల మంది ఐదేళ్లలోపు బాలలు కలుషిత గాలిని పీలుస్తున్నారు. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులకు గురై 2016లో దాదాపు 6 లక్షల మంది చిన్నారులు చనిపోయారు. ప్రతి పది మందిలో 9 మంది కలుషిత గాలినే పీలుస్తున్నారు. దీని కారణంగా ఏటా 70 లక్షల గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఐదేళ్లలోపు చనిపోయే ప్రతి పది మంది శిశువుల్లో ఒకరు వాయు కాలుష్యం కారణంగానే చనిపోతున్నారు. -
తెగతాగుతున్నారు!
న్యూఢిల్లీ: భారత్‌లో 2005తో పోల్చుకుంటే 2016 నాటికి మద్యం తలసరి వినియోగం రెట్టింపు అయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తన నివేదికలో తెలిపింది. ఇండియాలో 2005లో ఆల్కహాల్ తలసరి వినియోగం 2.4 లీటర్లుగా ఉండగా, 2016 నాటికి అది 5.7 లీటర్లకు చేరుకుందని వెల్లడించింది. వీరిలో పురుషులు సరాసరి 4.2 లీటర్ల మద్యాన్ని తాగేస్తుండగా, మహిళలు 1.5 లీటర్ల మందును లాగించేస్తున్నారని పేర్కొంది. 2025 నాటికి ఆగ్నేయాసియాలో 15 ఏళ్లకు పైబడి మద్యం సేవించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అప్పటికల్లా భారత్‌లో తలసరి వినియోగం మరో 2.2 లీటర్లు పెరుగుతుందని వెల్లడించింది. ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాల్లో మద్యం సేవించేవారి సంఖ్య స్వల్పంగా పెరుగుతుందంది. ఆగ్నేయాసియా తర్వాత పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో మద్యపాన సేవనం అధికంగా ఉంటుందని పేర్కొంది. 2005లో అంతర్జాతీయంగా తలసరి మద్యం వినియోగం 5.5 లీటర్లుగా ఉండగా, 2010 నాటికి అది 6.4 లీటర్లకు చేరుకుందనీ, 2016లో అదేస్థాయిలో కొనసాగుతోందని తెలిపింది. -
భూగర్భ జలాల్లో భారీగా యురేనియం!
వాషింగ్టన్: భారత్‌లోని 16 రాష్ట్రాల్లోని భూగర్భ జలాలు యురేనియంతో భారీగా కాలుష్యమయమైనట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌వో) ప్రమాణాల కన్నా ఎక్కువగా యురేనియం కాలుష్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తాగునీరు, సాగు నీటిలోనూ యురేనియం కాలుష్యం ఎక్కువగా ఉందని అమెరికాలోని డ్యూక్ యూనిర్సిటీ పరిశోధకులు చెప్పారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో అధ్యయనం జరపగా.. రాజస్తాన్, గుజరాత్ వ్యాప్తంగా ఉన్న 324 బావుల్లోని నీటిలో భారీ స్థాయిలో యురేనియం ఉన్నట్లు తేలింది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం దేశంలో లీటరుకు 30 మైక్రోగ్రాముల వరకు యురేనియం ఉండవచ్చు. -
కాలుష్యంలోనూ రాజధానే!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మరోసారి అపఖ్యాతి మూటగట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజా నివేదిక ప్రకారం గాలిలో ప్రతీ 10 మైక్రో మీటర్లకు వార్షిక సగటున 292 మైక్రోగ్రాముల ధూళి అణువులతో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరాల్లో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 14 భారత్‌లోనే ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. గాలిలో ప్రతీ ఘనపు మీటరు(2.5 పీఎం)లో అత్యంత సూక్ష్మ ధూళి కణాలున్న పట్టణంగా కాన్పూర్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో ఫరీదాబాద్, వారణాసి, గయ పట్టణాలున్నాయి. పట్నా, ఆగ్రా, ముజఫర్‌నగర్, శ్రీనగర్, గురుగ్రామ్, పాటియాలా, జోధ్‌పూర్‌లలోనూ వాయుకాలుష్యం దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది. ప్రపంచ జనాభాలో ప్రతీ పది మందిలో తొమ్మిది మంది కాలుష్యమైన గాలినే పీలుస్తున్నారంది. దీని కారణంగా 2016లో ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది మరణించారు. పంట వ్యర్థాలు కాల్చడం, వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే కాలుష్యం, ఇళ్లల్లో వాడే ఇంధన వ్యర్థాల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గాలిలో ప్రతీ ఘనపు మైక్రోమీటరులో 173 అత్యంత సూక్ష్మ ధూళి కణాలతో కాన్పూర్ ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో వరసగా ఫరీదాబాద్ (172), వారణాసి (151), గయ (149), పట్నా (144), ఢిల్లీ (143), లక్నో (138), ఆగ్రా (131), ముజఫర్‌పూర్ (120), శ్రీనగర్ (113) ఉన్నాయి. వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు ఎన్నోసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసింది. కానీ భారత్‌లో ఢిల్లీ మినహా ఇతర నగరాల్లో వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకున్న నిర్దిష్టమైన చర్యలేం లేవు. -
చంటిబిడ్డల కోసం కొండాకోనల్లోకి!
చంటిబిడ్డల కోసం కొండాకోనల్లోకి! హిమాచల్‌ప్రదేశ్... హిమాలయ పర్వతాల కుదురు! పీఠభూమి అంతమై పర్వత సానువులు మొదలయ్యే ప్రదేశం. ఇంకా చెప్పాలంటే పర్వత సానువుల్లో విస్తరించిన చిన్న చిన్న నివాస ప్రదేశాల సమూహం. పర్యటనకు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో దైనందిన జీవితానికి అంత కఠినమైన ప్రదేశం. రాష్ట్రంలో సగానికి పైగా గ్రామాలకు వేరే గ్రామాలను కలుపుతూ రోడ్లు ఉండవు. కొండల బారుల మధ్య కాలిబాటలోనే చేరుకోవాలి. మొబైల్ కనెక్షన్ ఉన్నా సిగ్నల్ ఉండదు, ఆ రెండూ కలిసినా ఫోన్ చార్జింగ్కు కరెంటు ఉండదు. ఇదీ గ్రామీణ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం. ఒకే రాష్ట్రంలో ఉంటారు, కానీ పేరుకైనా ఒకరి జిల్లాలు మరొకరికి తెలియని పరిస్థితులే ఎక్కువ. అలాంటి రాష్ట్రంలో ఓ అమ్మాయి గీతావర్మ. కమ్యూనిటీ హెల్త్‌వర్కర్‌గా ఆమె అక్కడ ఉద్యోగం చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన క్యాలెండర్లో గీతావర్మకు కూడా పేజీ ఉంది. అంటే విశేషం ఏదో ఉండాలి కదా! ఏమిటా విశేషం? పట్టు వదలని హెల్త్ వర్కర్ పిల్లలకు మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ వేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థతో మనదేశం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రచార ఉద్యమం మొదలైంది. అందులో భాగంగా దేశంలో అన్ని ఆరోగ్య కేంద్రాలకూ మందుల సరఫరా జరిగింది. చిన్న పిల్లలందరికీ హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్లు వేయడమూ జరుగుతోంది. అయితే అంతమందిలో గీతావర్మ ఒక్కరే ప్రత్యేకం అయ్యారు! ఆమె తన పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికీ వెళ్లి, ఇంటింటికీ తిరిగి చంటిబిడ్డల జాబితా నమోదు చేసుకుని వ్యాక్సిన్లు వేసింది. రోడ్డు ఉన్న చోట్ల టూ వీలర్ మీద వెళ్లింది. రోడ్డు లేని గ్రామాలకు సైతం వ్యాక్సిన్ మెటీరియల్ కిట్ మోసుకుంటూ మంచు నిండి, పట్టుజారిపోతున్న రాళ్ల బాటల్లో నడిచి వెళ్లింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ఎల్తైన ప్రదేశం ‘మండి’లో ఉన్న రిమోట్ సెటిల్‌మెంట్‌లనూ వదల్లేదామె. రాయగర్ వంటి మారుమూల గ్రామాల శివార్లలో గుడారాలు వేసుకుని నివసిస్తున్న గొర్రెల కాపర్ల కుటుంబాలను కూడా వెతికి పట్టుకుని వ్యాక్సిన్ వేసింది. ముఖ్యమంత్రి ప్రశంసలు ‘‘రాష్ట్రానికి గౌరవం తెచ్చావు తల్లీ’’ అంటూ సంతోషపడిపోయారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్. నూటికి నూరు శాతం వ్యాక్సిన్ వేసిన రికార్డు తన రాష్ట్రానికి అందడం ఒక సంతోషం, ఆ గొప్పతనాన్ని సాధించింది ఒక మహిళ కావడం మరొక సంతోషం. ఒక ప్రభుత్వ ఉద్యోగి అంతటి అంకితభావంతో విధులు నిర్వహించడం మరింత సంతోషం. గీతావర్మ సేవలు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టడం మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మనదేశానికి చోటు కల్పించినందుకు గర్వంగా భావిస్తున్నారు ఆ రాష్ట్రంలోని ప్రముఖులు. ప్రతిష్టాత్మకమైన ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ గుర్తింపు తెచ్చినందుకు ఇతర రాష్ట్రాలు కూడా గీతావర్మను అభినందిస్తున్నాయి. ఇలాంటి అమ్మాయి రాష్ట్రానికి ఒక్కరుంటే చాలన్నంతగా గీతావర్మకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. డబ్లు్య.హెచ్.వో. గీతావర్మది హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లా, కర్సోగ్ తెహ్సిల్లోని సాప్నోత్ గ్రామం. అదే జిల్లాలోని శంకర్దెహ్రా హెల్త్ సబ్ సెంటర్లో డ్యూటీ. ఆమె అక్కడికి దగ్గర్లోని సెరాజ్ వ్యాలీలోని ఎగుడుదిగుడు రోడ్ల మీద టూవీలర్లో ప్రయాణించడం ఫేస్బుక్లో వైరల్ అయింది. ట్విటర్, వాట్సాప్‌లలోనూ శరవేగంతో తిరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆమె సర్వీస్‌ను గుర్తించింది. ఈ ఏడాదికి విడుదల చేసిన క్యాలెండర్లో గీతావర్మ మంచుకొండల మధ్య వ్యాక్సిన్ కిట్ మోసుకుంటూ నడుస్తున్న ఫొటోను, క్లుప్తంగా వివరాలనూ ప్రచురించింది. – మను -
90% చెడు గాలే..: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా 90% ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుబాటులో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రతీ 10 మందిలో 9 మంది కాలుష్యపూరిత వాయువులనే పీలుస్తున్నారని, గ్రామాల్లోన సమస్య తీవ్రంగానే ఉందని తెలిపింది. వాయు కాలుష్య బాధితులు ప్రధానంగా పేద దేశాల ప్రజలేనంది. వాయు కాలుష్యం వల్ల ఏటా 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగాఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో భారత్‌లో అధిక మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.