న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మరోసారి అపఖ్యాతి మూటగట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదిక ప్రకారం గాలిలో ప్రతీ 10 మైక్రో మీటర్లకు వార్షిక సగటున 292 మైక్రోగ్రాముల ధూళి అణువులతో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరాల్లో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 14 భారత్‌లోనే ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. గాలిలో ప్రతీ ఘనపు మీటరు(2.5 పీఎం)లో అత్యంత సూక్ష్మ ధూళి కణాలున్న పట్టణంగా కాన్పూర్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది.
తర్వాతి స్థానంలో ఫరీదాబాద్, వారణాసి, గయ పట్టణాలున్నాయి. పట్నా, ఆగ్రా, ముజఫర్‌నగర్, శ్రీనగర్, గురుగ్రామ్, పాటియాలా, జోధ్‌పూర్‌లలోనూ వాయుకాలుష్యం దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది. ప్రపంచ జనాభాలో ప్రతీ పది మందిలో తొమ్మిది మంది కాలుష్యమైన గాలినే పీలుస్తున్నారంది. దీని కారణంగా 2016లో ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మంది మరణించారు. పంట వ్యర్థాలు కాల్చడం, వాహనాలు, పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే కాలుష్యం, ఇళ్లల్లో వాడే ఇంధన వ్యర్థాల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
గాలిలో ప్రతీ ఘనపు మైక్రోమీటరులో 173 అత్యంత సూక్ష్మ ధూళి కణాలతో కాన్పూర్ ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో వరసగా ఫరీదాబాద్ (172), వారణాసి (151), గయ (149), పట్నా (144), ఢిల్లీ (143), లక్నో (138), ఆగ్రా (131), ముజఫర్‌పూర్ (120), శ్రీనగర్ (113) ఉన్నాయి. వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు ఎన్నోసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసింది. కానీ భారత్‌లో ఢిల్లీ మినహా ఇతర నగరాల్లో వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకున్న నిర్దిష్టమైన చర్యలేం లేవు.
Comments
Please login to add a commentAdd a comment