- బీడీలు, గ్రానైట్, తాగునీరు, సాగునీటిపై అధిక పన్నుతో పెనుభారం
- ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్ లేఖలు
సాక్షి, హైదరాబాద్: బీడీ పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టుల పనులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గురువారం లేఖలు రాశారు. రాష్ట్రంలో వేలాది మంది బీడీలు చుట్టి బతుకుతున్నారని, బీడీ పరిశ్రమపై అధిక పన్నులు వేయడం వల్ల వారి ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో 2 వేలకుపైగా ఉన్న గ్రానైట్ యూనిట్లలో రెండు లక్షల మంది ప్రత్యక్షంగా, ఐదు లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు.
గ్రానైట్, మార్బుల్ ముడి బ్లాక్‌లపై 12 శాతం, ఫినిషింగ్ ఉత్పత్తులపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుందని, అంత ఎక్కువ పన్ను వేయడం వల్ల గ్రానైట్ పరిశ్రమ దెబ్బతిని లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముంద న్నారు. రా బ్లాక్స్, ఫినిష్డ్ ఉత్పత్తులు... రెండింటిపై 12% పన్ను విధించాలని సీఎం కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు మిషన్ భగీరథ, రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పనులపై అత్యధిక జీఎస్టీ విధించడం భావ్యం కాదని, వీటిపై పునరాలోచించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ నాలుగింటిపై విధించిన పన్ను రేట్లు తమ రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా దేశం మొత్తం మీద ఒకే పన్ను విధానం ఉండేందుకు జీఎస్టీ అమలు చేయడంపట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.