సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు గండిపెట్టే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా పంచుకుంటున్న కేంద్రం.. వీలైనన్ని ఎక్కువ సరుకులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై లీటర్‌కు రూ.2 ఎక్సైజ్ సుంకం తగ్గించి, 5 శాతం వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలకు ప్రతిపాదించి... తాజాగా రియల్ ఎస్టేట్, లిక్కర్ రంగాలపై దృష్టి సారించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని జీఎస్టీ పరిధిలోకి తేవడం ద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పంచుకునే చర్యలకు ఉపక్రమించింది. దీంతోపాటు లిక్కర్ ముడి సరుకు అయిన ఇథనాల్ రవాణాపై పన్ను విధించడం ద్వారా పరోక్షంగా మద్యం ఆదాయాన్ని కూడా రాబట్టుకునే దిశలో ముందుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కీలక పాత్ర పోషించే ఈ మూడు రంగాల ఆదాయాన్ని పంచుకోవడంతో పాటు పన్ను విధించే అధికారాన్ని కూడా తానే తీసుకోవడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక వనరులపై పట్టుబిగించనుంది.
ప్రతి లావాదేవీపై వాటా
రియల్ ఎస్టేట్ రంగాన్ని జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావడం ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పంచుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనను రాష్ట్రానికి పంపిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఈ నెల 23న జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో కూడా చర్చ జరిగిందని, రియల్ ఎస్టేట్‌ని జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలన్న కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ రంగాన్ని జీఎస్టీ పరిధిలోనికి తెస్తే రిజిస్ట్రేషన్ ఆదాయంలో సగం వాటా కేంద్రానికి ఇవ్వా ల్సి వస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2,800 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చింది. మరో రూ.3 వేల కోట్ల వరకు ఆదా యం వచ్చే అవకాశం ఉంది. ఇందులో రూ.2 వేల కోట్ల వరకు జీఎస్టీ ద్వారా కేంద్రానికి వెళ్లనుంది. అంటే ఆ మేరకు రాష్ట్ర ఖజానాకు గండిపడనుందనే చర్చ పన్నుల శాఖ వర్గాల్లో జరుగుతోంది. వచ్చేనెల 10న గువాహటిలో జరిగే 23వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఎజెండాగా పెట్టనున్నారని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించనుందని సమాచారం.
లిక్కర్‌పై పరోక్షంగా..
పెట్రోల్, మద్యం జీఎస్టీ పరిధిలో లేవు. లిక్కర్ ఆదాయాన్ని పంచుకునేందుకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష మార్గాన్ని కేంద్రం ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగా మద్యం ఆదాయంపై ప్రభావితం చూపే ముడిసరుకు ఇథనాల్ రవాణాను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెట్రోల్‌పై ఇంకా రాని నిర్ణయం
వాస్తవానికి పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వాలే వ్యాట్ వసూలు చేసుకుంటాయి. ఈ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేలేదు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చి ధరలను తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో కేంద్రం తాను విధిస్తోన్న ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.2 చొప్పున తగ్గించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నెలకు రూ.44 కోట్ల చొప్పున ఏటా రూ.528 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి తోడు రాష్ట్రాలు కూడా పెట్రోల్‌పై 5 శాతం వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరింది. అలా తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని పన్నుల శాఖ వర్గాల అంచనా. దీంతో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గింపుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం చేసిన ఈ ప్రతిపాదనను తిరస్కరించే యోచనలో రాష్ట్రం ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment