
చాందీకి ఉపశమనం
సోలార్ కుంభకోణంలో ఎఫ్‌ఐఆర్ నమోదుపై హైకోర్టు స్టే
విజిలెన్స్ జడ్జి తప్పుకోవాలని ఆదేశం
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వాన్ని కుదిపేసిన సోలార్ స్కాంలో సీఎం ఊమెన్ చాందీకి కేరళ హైకోర్టు తీర్పు ఉపశమనం కలిగించింది. చాందీపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలంటూ.. విజిలెన్స్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో పాటు సీఎం, మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశాలిచ్చిన సదరు జడ్జిని విధులనుంచి తప్పుకోవాలని అధికారులను ఆదేశించింది. ‘జడ్జి తన పరిధిని తెలుసుకోకుండా, వాస్తవాలు గుర్తించకుండా న్యాయపరమైన తప్పిదాలు చేశారు’ అని హైకోర్టు మండిపడింది. హైకోర్టు తీరుపై నిరసన తెలిపిన విజిలెన్స్ జడ్జి ఎస్‌ఎస్ వాసన్.. స్వచ్ఛంద పదవీ విరమణ (మే, 2017లో రిటైర్మెంట్ ఉంది)కు అనుమతివ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను కోరారు. కాగా, చాందీ స్పందిస్తూ.. ‘ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నాపై ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగమని ప్రజలకు అర్థమైంది. నిర్దోషిగా బయటికొస్తా’ అని అన్నారు. లిక్కర్ లాబీ, సీపీఎం కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నుతున్నాయన్నారు.
సరిత తాజా ఆరోపణలు.. స్కాంలో.. సీఎంపై ఆరోపణలు చేసిన సరిత నాయర్ శుక్రవారమూ సోలార్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సీఎంతో పాటు ఆయన కుమారుడు చాందీ ఊమెన్‌పై తాజాగా ఆరోపణలు చేశారు. ‘కేరళ పునరుత్పాదక శక్తి సహకార సొసైటీ స్థాపించమని సీఎం చెప్పారు. ఇందులో ఆయన కుమారుడితోపాటు పలువురు కుటుంబ సభ్యులనూ చేర్చుకోమన్నారు. ఇప్పటికే ఓ అమెరికా కంపెనీలో భాగస్వామిగా ఉన్న సీఎం కుమారుడు.. అక్కడ తయారైన సోలార్ ప్లేట్లను ఈ కంపెనీ దిగుమతి చేసుకోవాలన్నారు’ అని ఆరోపించారు. కాగా, చాందీ రాజీనామా చేయాలని విపక్ష ఎల్‌డీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు.