
‘మోదీ గారూ.. మా సోదరిని వెతికించండి’
బీజింగ్: త్వరలో చైనా పర్యటించనున్న ప్రధాని మోదీ... అక్కడే ఉన్న తన సోదరిని వెతికించాలని చెన్నై మహిళ జెన్నిఫర్ యాన్ కోరారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం తన తండ్రి అన్ చి పాంగ్ కుటుంబంలో మిగిలిన ఏకైక మహిళ, తన సవతి సోదరి యాన్ రోసెయ్‌ను ఆచూకీ కనుగొనాలని ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. మోదీ గతంలో నేపాల్ పర్యటనలో.. నేపాలీ బాలుడిని తల్లిదండ్రులతో కలపడం తెలిసిందే.
తనకూ అలాంటి సాయం అందుతుందని భావించిన జెన్నిఫర్.. తన సోదరిని వెదికేందుకు భర్తతో కలసి చైనా వచ్చారు. చైనీస్ మెరైన్ ఇంజనీర్ అన్ చి పాంగ్ తొలి భార్య కుమార్తె యాన్ రోసెయ్. చైనాలోని నాంజింగ్ నగరంలో స్థిరపడిన అతని కుటుంబం మొదటి భార్య, ఆరుగురి పిల్లలతో సహా బాంబు దాడిలోనో, జపాన్ సైన్యం ఊచకోతలోనో మరణించారు. తర్వాత పాంగ్ చెన్నై చేరుకుని ఇరెనా పెరీరా అనే మహిళను వివాహమాడారు. వీరికి జెన్నిఫర్‌తో సహా నలుగురు పిల్లలు పుట్టారు.