
రిపోర్ట్ కార్డా..? రాజీనామానా?
నేటి ప్రధాని ప్రెస్‌మీట్‌పై సర్వత్రా ఆసక్తి
పదేళ్లకాలంలో ఇది మూడో మీడియా సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల పదవీకాలంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మీడియా ముందుకు రానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ రైసినా రోడ్డులోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఆయన పూర్తిస్థాయి విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు. యూపీఏ-1 హయాంలో మొదటిసారి ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఒకసారి, యూపీఏ-2 అధికారంలోకి వచ్చిన తరువాత 2009 మేలో మరోసారి ఆయన విలేకరులతో సంభాషించారు. రాజీనామా ప్రకటన, రాహుల్‌గాంధీకి రంగం సిద్ధం చేసే ప్రయత్నం.. ఇలా పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న పరిస్థితుల్లో.. నేటి ప్రధాని ప్రెస్‌మీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
అవినీతి, ఆర్థికవ్యవస్థ, విదేశాంగ వ్యవహారాలు.. ఈ మూడు రంగాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రెస్‌మీట్లో ప్రధానంగా ప్రధాని ప్రస్తావించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అవినీతి, ధరల పెరుగుదల, విధానపరమైన నిష్క్రియాపరత్వంపై విమర్శలు చెలరేగుతున్న తరుణంలో వాటిని తిప్పికొట్టే దిశగా ఆయన ప్రసంగం సాగవచ్చనుకుంటున్నారు. ముఖ్యంగా లోక్‌పాల్ చట్టం, అవినీతిని అరికట్టే ఉద్దేశంతో రూపొందిస్తున్న ఇతర ప్రతిపాదిత బిల్లులను, ధరల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించవచ్చు. విలేకరుల సమావేశం సందర్భంగా రాజీనామా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న ఎవరినుంచైనా వస్తే.. ‘2014 మే తర్వాత రేస్‌లో ఉండను’ అని మన్మోహన్ స్పష్టంగా చెప్పవచ్చని, అలాగే కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ నాయకత్వం వహించాలన్న వైఖరిని పునరుద్ఘాటించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో.. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ‘తరం మార్పు’ను స్వాగతిస్తూ మన్మోహన్ కీలక ప్రకటన చేస్తారా లేక యూపీఏ హయాంపై రిపోర్డు కార్డుతోనే సరిపెడతారా అనేది నేడు తేలనుంది.