డకోటా యుద్ధ విమానం (ఫైల్)
న్యూఢిల్లీ: 1947 భారత్–పాకిస్తాన్ యుద్ధంలో కీలకపాత్ర పోషించిన డకోటా యుద్ధ విమానం మార్చిలో తిరిగి వాయుసేనలో చేరనుంది. పూర్తిగా పాతబడిపోయిన ఈ విమానాన్ని బెంగళూరుకు చెందిన రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కొని బ్రిటన్‌లో ఆరేళ్లు మరమ్మతులు చేయించి వాయుసేకు బహుమతిగా అందిస్తున్నారు. అందుకు సంబంధించిన పత్రాలను ఆయన మంగళవారం ఢిల్లీలో ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాకు అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ వైమానిక స్థావరంలో దీనిని ఉంచనున్నారు.
డకోటాగా పిలిచే డగ్లస్ డీసీ3 విమానాలను 1930ల్లో వాయుసేనలో ప్రవేశపెట్టారనీ, లడఖ్‌తోపాటు ఈశాన్య ప్రాంతంలో ఇవి ప్రధానంగా సేవలందించేవని ధనోవా గుర్తుచేశారు. డకోటా యుద్ధ విమానాల వల్లే జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ ఇంకా మనదగ్గర ఉందని మిలిటరీ చరిత్రకారుడు పుష్పీందర్ సింగ్ గతంలో అన్నారు. ఈ విమానానికి భారత్ ‘పరశురామ’ అని నామకరణం చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ఈ విమానం వచ్చే నెలలోనే భారత్‌కు చేరుకోనుంది. ఈ విమానాన్ని కొని మరమ్మతులు చేయించడంలో తనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయని చంద్రశేఖర్ తెలిపారు. చంద్రశేఖర్ తండ్రి గతంలో డకోటా విమానాలకు పైలట్‌గా పనిచేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment