ఎండల తీవ్రతకు ఐదుగురు మృతి
వారిలో ఒక తెలుగు వ్యక్తి!
సాక్షి, చెన్నై: చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షో చేదు అనుభవం మిగిల్చింది. ఎండలకు తాళలేక సొమ్మసిల్లి ఐదుగురు చనిపోగా, 230 మంది ఆస్పత్రి పాలయ్యారు. మృతుల్లో ఒకరు తెలుగు వ్యక్తి అని సమాచారం. షో ఉదయం 11 నుంచి కాగా జనం 8 గంటలకే మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివచ్చారు. ఎండ తీవ్రతకు చాలామంది షో ప్రారంభం కాకమునుపే సొమ్మసిల్లి పడిపోయారు.
తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదని వాపోయారు. భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలు చేశాయి. వీటిని చూసేందుకు ఏకంగా 16 లక్షల మంది తరలివచ్చారు. ప్రదర్శన అనంతరం అంతా ఒక్కసారిగా ఇళ్లకు మరలడంతో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.
మండుతున్న ఎండ, రద్దీతో ముందుకు సాగేందుకు మార్గం లేకపోవడంతో ఒంట్లో ఓపికలేక చాలామంది రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు. బీచ్‌కు సమీపంలోని వారు కొందరికి మంచినీరు సరఫరా చేయడంతో పరిస్థితి కొంత తేలికపడింది. అయితే, జనం మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగానికి తగు ప్రణాళిక లేదని, కనీస వసతులు సైతం ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెరీనా బీచ్ రోడ్డులో కిక్కిరిసిన జన సందోహం
Comments
Please login to add a commentAdd a comment