sunstrok
-
చుక్కలు చూపిన ఎయిర్ షో
సాక్షి, చెన్నై: చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షో చేదు అనుభవం మిగిల్చింది. ఎండలకు తాళలేక సొమ్మసిల్లి ఐదుగురు చనిపోగా, 230 మంది ఆస్పత్రి పాలయ్యారు. మృతుల్లో ఒకరు తెలుగు వ్యక్తి అని సమాచారం. షో ఉదయం 11 నుంచి కాగా జనం 8 గంటలకే మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివచ్చారు. ఎండ తీవ్రతకు చాలామంది షో ప్రారంభం కాకమునుపే సొమ్మసిల్లి పడిపోయారు. తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదని వాపోయారు. భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలు చేశాయి. వీటిని చూసేందుకు ఏకంగా 16 లక్షల మంది తరలివచ్చారు. ప్రదర్శన అనంతరం అంతా ఒక్కసారిగా ఇళ్లకు మరలడంతో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మండుతున్న ఎండ, రద్దీతో ముందుకు సాగేందుకు మార్గం లేకపోవడంతో ఒంట్లో ఓపికలేక చాలామంది రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు. బీచ్‌కు సమీపంలోని వారు కొందరికి మంచినీరు సరఫరా చేయడంతో పరిస్థితి కొంత తేలికపడింది. అయితే, జనం మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగానికి తగు ప్రణాళిక లేదని, కనీస వసతులు సైతం ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మెరీనా బీచ్ రోడ్డులో కిక్కిరిసిన జన సందోహం -
వడదెబ్బకు 12 మంది బలి
సాక్షి నెట్వర్క్: భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల కారణంగా వడదెబ్బ తగిలి రాష్ట్రవ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యూలవాడకు చెందిన తుమ్మల నాగయ్య(55), తొర్రూరు మండలం వెలికట్ట శివారు పెద్దమాగ్యా తండాకు చెందిన జాటోలు జేతురాం(55), నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన నాతి పెద్దమ్మ(105) వడదెబ్బ బారినపడి మరణించారు. ఇదే జిల్లా మునగాల మండలం కలకోవకు చెందిన పనస శ్రీరాములు(60) మూడు రోజులుగా వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై, చికిత్స పొందుతూ మృతి చెందాడు. నార్కట్‌పల్లి మండలం బి.వెల్లంలకు చెందిన గొర్రెల కాపరి సోమనబోయిన చిన్న రాములు (70), ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్‌కు చెందిన జాకటి వెంకమ్మ (70), ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం భీమునిగూడానికి చెందిన కుర్సం భద్రయ్య(37), బయ్యూరం మండలం జగ్గుతండాకు చెందిన బానోత్ బద్రి(66), సత్తుపల్లికి చెందిన పూచి నాగరాజు(28), ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన షేక్ మదార్బీ(72) వడదెబ్బ కారణంగా మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూర్‌కు చెందిన బోట్క బాల్‌లక్ష్మమ్మ (50) ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లి, వడదెబ్బతో అక్కడే మరణించింది. కొత్తకోట మండలం మదనాపురంలో గుట్ట వద్ద రాళ్లు కొడుతూ జీవించే బక్కన్న (58) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై, మృతిచెందాడు.