అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై కమ్ముకున్న అనుమానాల మేఘాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన న్యాయవిచారణ కమిషన్ ఏట్టకేలకూ పనిచేయడం ప్రారంభించింది. కమిషన్ చైర్మన్‌గా గతంలో బాధ్యతలు చేపట్టిన రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి శుక్రవారం చెన్నై ఎళిలగం భవనంలోని కమిషన్ కార్యాలయానికి వచ్చి విచారణ పనుల్లో నిమగ్నమయ్యారు. జయ మరణ మిస్టరీకిబాధ్యులను చేసే ప్రయత్నంలో ఎవరెవరు విచారణకుగురవుతారోననే చర్చ మొదలైంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై : స్వల్ప అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తరువాత బాహ్య ప్రపంచంలోకి రాకుండానే అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు. కోలుకుని ఇంటికెళ్లాల్సిన జయలలిత కానరానిలోకాలకు పోవడంపై అమ్మ అభిమానులు కోపంతో భగ్గుమన్నారు. న్యాయవిచారణ లేదా సీబీఐ విచారణ జరిపించాలని అప్పటి అన్నాడీఎంకే చీలిక వర్గనేత పన్నీర్‌సెల్వం, ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. నలువైపులా ఒత్తిడి పెరగడంతో న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ సీఎం ఎడపాడి పళనిస్వామి గత నెల 25వ తేదీన ఒక ప్రకటన చేశారు. కమిషన్ చైర్మన్‌గా రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామిని నియమించి జయ మరణంపై మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చెన్నై మెరీనాబీచ్‌రోడ్డులోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయ ఎళిలగం భవనంలో కమిషన్ కార్యాలయాన్ని కేటాయించారు.
ఇదిలా ఉండగా కమిషన్ ఏర్పాటై నెలరోజులు పూర్తయినా దాటినా విచారణ ప్రారంభం కాలేదు. కార్యాలయ పనులు పూర్తికానందున మరింత జాప్యం ఖాయం, గడువులోగా నివేదిక సమర్పణ అసా«ధ్యమని రెండురోజుల క్రితం మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో కమిషన్ చైర్మన్ ఆర్ముగస్వామి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కమిషన్ కార్యాలయానికి వచ్చి పనులు ప్రారంభించారు. ఈనెల 30వ తేదీన పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసాన్ని పరిశీలించడం ద్వారా ఆర్ముగస్వామి తన విచారణకు శ్రీకారం చుట్టనున్నారు. న్యాయవిచారణ సందర్భంగా ఎవరెవరిని విచారణకు పిలుస్తారోనని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
పోయెస్‌గార్డెన్‌లోని జయ ఇల్లు వేదానిలయం పరిశీలనతో విచారణలో అసలైన అంకం సోమవారం ప్రారంభం అవుతుంది. విచారణ పారదర్శకంగా జరుగుతుందాని ప్రశ్నించగా ‘తప్పకుండా’ అని సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయంలో ఒక నోటీసు బోర్డు పెట్టారు. అందులో...జయలలిత మరణం గురించి ప్రత్యేక సమాచారం ఉన్నవారు, నేరుగా సంబంధాలు ఉన్నవారు తగిన ఆధారాలతో సత్యప్రమాణ పత్రం ద్వారా లిఖితపూర్వకంగా తెలుపవచ్చని పేర్కొన్నారు. నవంబర్ 22వ తేదీలోగా నేరుగా లేదా పోస్టు ద్వారా తమ సమాచారాన్ని చేరవేయవచ్చని తెలిపారు.
ఇదిలా ఉండగా, జయ మరణ నేపథ్యంతో సంబంధం ఉన్నవారిని ఆయన నేరుగా పిలిపించి మాట్లాడతారా లేక ఆయన వెళ్లి విచారిస్తారు, విచారణ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి అనే ప్రశ్నలు నేతల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా, పార్టీ నుంచి చీలిపోయిన తరువాత పన్నీర్‌సెల్వం వర్గంలోని కొందరు నేతలు తమ వద్ద సాక్ష్యాధారాలున్నట్లు మీడియా వద్ద ప్రకటించారు. అయితే ప్రస్తుతం వారంతా ఎడపాడితో కలిసిపోయారు. ప్రజలు ఎక్కువగా అనుమానిస్తున్న శశికళను ప్రధానంగా విచారించాలని కోరుకుంటున్నారు. విచారణ కోసం ఆమెను చెన్నైకి రప్పిస్తారా, కమిషన్ చైర్మనే బెంగళూరు జైలుకు వెళతారా, చికిత్స చేసిన లండన్ వైద్యుడి మొదలుకుని అపోలో వైద్యబృందం కూడా కమిషన్ వద్ద క్యూకట్టాల్సిందేనాని చర్చోపచర్చలు సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment