అఫ్జల్ గురు ఉరిశిక్షకు ప్రతీకారంగానే..?
శ్రీనగర్: అఫ్జల్ గురు మరణదండనకు ప్రతీకారంగా తీవ్రవాదులు నగ్రోటా సైనిక ఆయుధాగారంపై దాడి చేసినట్టు వెల్లడైంది. జమ్మూకశ్మీర్ లోని నగ్రోటాలో మంగళవారం తీవ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురు సైనికులు మరణించారు. దాడికి పాల్పడిన ముగ్గురు తీవ్రవాదులను సైనిక దళాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన అనంతరం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు ఉర్దూలో రాసిన పత్రాలు దొరికాయి.
పార్లమెంట్ పై దాడి కేసులో అఫ్జల్ గురుకు మరణశిక్ష అమలు చేసినందుకు ప్రతీకారంగా దాడి దిగినట్టు ఈ పత్రాల్లో రాసివుంది. ‘అఫ్జల్ గురుకు మరణదండన విధించినందుకు మొదటి విడతగా ఈ దాడి చేశామ’ని ఉర్దూలో రాసివున్నట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. 2011 పార్లమెంట్ పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురును 2013లో ఉరి తీశారు.
కాగా, నగ్రోటాలో ఎన్ కౌంటర్ ఘటనా స్థలంలో ఏకే-47 తుపాకులు, భారీ సంఖ్యలో తూటాలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నగ్రోటాలో ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలో ఆర్మీచీఫ్ దల్బీర్ సింగ్ పర్యటించారు.